కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్నలు

by Muthe.Rajitha |

కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై హైకోర్టులో నేడు జరిగిన విచారణ రేపటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్నలు
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం కమిషన్‌ రిపోర్ట్‌పై హైకోర్టులో నేడు జరిగిన విచారణ రేపటికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం నివేదికపై హైకోర్టు రాష్ట్ర ప్రబుభుత్వానికి పలు సూటి ప్రశ్నలు వేసింది. ఈ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పమని, చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పమని, అసలు చర్యలు తీసుకుంటారా లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు హైకోర్టులో సవాల్‌ చేశారు.

వీరి పిటిషన్ ను విచారించిన ధర్మాసనం... ఈ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెడతారు, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో పెడతారా, లేక అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా అని హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ సమాధానం ఇస్తూ.. కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ సమాధానం తెలిపేందుకు ఒకరోజు సమయం కావాలని అడగ్గా.. విచారణ రేపటికి వాయిదా పడింది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ 17 నెలల పాటు విచారణ జరిపి, 650 పేజీలకు పైగా నివేదికను గత జులై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో కేసీఆర్‌, హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌ల పేర్లు పలుమార్లు ప్రస్తావించబడ్డాయి. ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి, చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

అయితే కేసీఆర్‌, హరీశ్‌ రావు ఈ నివేదికను రాజకీయ కక్షతో తయారు చేసినట్లు ఆరోపిస్తూ, దానిపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. నివేదికపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, అసెంబ్లీలో చర్చకు ముందే చర్యలు తీసుకుంటారా లేదా తర్వాత తీసుకుంటారా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.

Next Story