కాళేశ్వరంపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఇరిగేషన్ శాఖ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని, కేవలం సాంకేతిక అంశాలనే ప్రస్తావించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాళేశ్వరంపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఇరిగేషన్ శాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) వెలువరించిన తీర్పుపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ స్పందించింది. ఈ తీర్పు కేవలం సాంకేతిక అంశాలకు సంబంధించిందే తప్ప, ఎవరికీ క్లీన్‌చిట్ (Clean Chit) ఇవ్వలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు పూర్తిగా సమర్థించిందని తెలిపారు.ఆ కమిషన్ ఏర్పాటును ఎక్కడా తప్పుబట్టలేదని పేర్కొన్నారు. విచారణ నివేదికలో పేర్కొన్న కొందరు బాధ్యులపై చేసిన కామెంట్లకు సంబంధించి, వారికి నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక, విధానపరమైన అంశాలను మాత్రమే కోర్టు ప్రస్తావించిందని అన్నారు. నోటీసులు ఇవ్వని కారణంగా వారిపై చేసిన రిమార్క్స్ ‘ఇన్ ఆపరేటివ్’గా ఉంటాయని కోర్టు సూచించిందని వెల్లడించారు. ఇది పూర్తిగా ప్రొసిజరల్ అంశమని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తీర్పు ఈ కేసులోని బాధ్యులెవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది.

ప్రాజెక్టు వైఫల్యంపై ప్రభుత్వం ఆందోళన..

రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే కుంగిపోవడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)లో ఏడో బ్లాక్ కుంగిపోయిందని, అక్కడ తప్పు జరిగిందన్నది అక్షర సత్యమని పేర్కొంది. ప్రాజెక్టు సైట్ ఎంపిక, డిజైన్లు, నిర్మాణంలో లోపాలున్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే నివేదికలు సమర్పించాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా సుదీర్ఘ విచారణ తర్వాత ప్రాజెక్టులోని లోపాలు, అవకతవకలు, బాధ్యుల వివరాలను వెల్లడించింది.

సీబీఐ దర్యాప్తు కొనసాగింపు..

బాధ్యులెవరో తేల్చాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంటూ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. విజిలెన్స్ (Vigilance), ఎన్డీఎస్ఏ (NDSA), ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వం ఇప్పటికే సీబీఐకి లేఖ రాసింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్ 1న ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం జీవోతో పాటు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హైకోర్టు వెలువరించిన పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.

Next Story