అసెంబ్లీ టికెట్‌పై BRS పాలసీ ఇదే.. దిక్కుతోచని స్థితిలో సీనియర్ నేతలు!

by Disha Web Desk 2 |
అసెంబ్లీ టికెట్‌పై BRS పాలసీ ఇదే.. దిక్కుతోచని స్థితిలో సీనియర్ నేతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలకు అధిష్టానం చెక్ పెట్టింది! ఫ్యామిలీలో ఒక్కరికే టికెట్ ఇస్తామని పార్టీ విధానపర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదికూడా సర్వేల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా గెలిచే వారికే బీఫామ్ ఇస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో వారసులకు టికెట్ ఇప్పించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న సీనియర్లు నిరాశకు గురవుతున్నట్లు తెలిసింది.

రెండు టికెట్లిస్తే కొత్త సమస్యలు

ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇస్తే ఇతర లీడర్ల నుంచి విమర్శలు వచ్చే ప్రమాదముంది. అసమ్మతివాదులంతా ఏకమై పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం పనిచేస్తారనే భయం గులాబీ పెద్దలకు ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే ఒక కుటుంబానికి ఒకే టికెట్ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండు టికెట్లు అడుగుతున్న మెజార్టీ మంది లీడర్లు ఓసీ వర్గానికి చెందిన వారే ఉన్నారు. అలా ఇస్తే ఇతర వర్గాల నుంచి కూడా విమర్శలు రావచ్చని ప్రగతిభవన్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆశావహులపై పలు సర్వేలు

అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్ ఇవ్వాలని చాలా మంది లీడర్లు సీఎం కేసీఆర్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఇందులో కొందరు కొడుకులు, కూతుళ్ల కోసమైతే, మరికొందరు తమ్ముళ్లు, అల్లుళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరందరూ అడుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలపై అధిష్టానం ఇప్పటికే పలు సర్వేలు జరిపినట్టు తెలిసింది. ఈ రిపోర్టులో కొడుకుల కంటే తండ్రులకే ప్రజలు జేజేలు కొడుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సంబంధిత ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది.

మైనంపల్లి రాజకీయ విందులు

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్ కోసం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈ మధ్య ఏడుపాయల సమీపంలో పెద్ద దావత్ ను ఏర్పాటు చేశారు. తన కొడుక్కు మెదక్ అసెంబ్లీ టికెట్ వస్తుందని ప్రకటించి, లోకల్ లీడర్ల ఆశీస్సులు అడిగినట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం మైనం పల్లి విందు రాజకీయాలపై రిపోర్టు తెప్పించుకున్నట్టు సమాచారం.

తలసాని, పద్మరావుల విశ్వప్రయత్నాలు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్ను ఈసారి ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పై పడింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోగ్యరిత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని గ్రహించిన తలసాని ఈసారి ముషీరాబాద్ నుంచి పోటీ చేసి, తన కొడుకు సాయికిరణ్ ను సనత్ నగర్ నుంచి పోటీకి దింపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ తనకు, ఎంపీ సీటు తన కొడుకు రామేశ్వర్ గౌడ్ కు ఇప్పించుకునేందుకు డిప్యూటీ స్పీకర్ పద్మరావు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇద్దరిలో ఒకరికే..

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈసారి తన కొడుకు కార్తీక్ రెడ్డిని చట్టసభల్లోకి పంపించాలని పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం రాజేంద్రనగర్ టికెట్ ను కార్తీక్ కు ఇప్పించుకునేందుకు మజ్లిస్ సహకారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ లో ఏదో ఒక సీటులో ఎవరు పోటీ చేస్తారో తేల్చుకోవాలని సబితా, కార్తీక్ లకు పార్టీ పెద్దలు ఆప్షన్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. మాజీ మంత్రి రెడ్యానాయక్ ఆయన కూతురు, మహబూబ్ బాద్ ఎంపీ కవితలో ఒక్కరికే టికెట్ ఇస్తామనే సంకేతాలు ప్రగతిభవన్ వర్గాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.

గుత్తా ఆశలు ఫలించేనా?

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈసారి తన కొడుకు అమిత్ రెడ్డికి నల్లగొండ నుంచి పోటీ చేయించాలని ఆశపడుతున్నారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, అక్కడ తమ ఫ్యామిలీ గెలవడం చాలా సులువని ఆయన భావిస్తున్నారు. అయితే నల్లగొండ ఎంపీ స్థానం నుంచి అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ తేరాపు చిన్నపు రెడ్డిని బరిలోకి దించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

కడియం కల నెరవేరేనా?

మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తన కుమార్తె కావ్యను వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కావ్యతో నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేయిస్తున్నారు. అందులో భాగంగా ఆయన స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పర్యటించడం, వాటిపై సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. అయితే కడియం మాత్రం తన కుమార్తె ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ధీమాగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తనయుల కంటే తండ్రులే మేలు

వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసత్వాన్ని తన కొడుకు భాస్కర్ రెడ్డికి ఇవ్వాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మధ్య సీఎం కేసీఆర్ బాన్సువాడలో పర్యటించిన సందర్భంగా పోచారం వచ్చే ఎన్నికల్లో తనతోపాటే పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటనతో పోచారం కొడుకుకు అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చినట్లయింది. పోచారం కొడుకుపై జరిపించిన పలు సర్వే రిపోర్టులు నెగెటివ్ గా రావడంతోనే సీఎం కేసీఆర్ ఆ ప్రకటన చేశారనే ప్రచారం జరుగుతున్నది. అలాగే నిజామాబాద్ రూరల్ లో కూడా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కొడుకు పట్ల లోకల్‌గా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, అక్కడ మళ్లీ బాజిరెడ్డికే టికెట్ ఇస్తారని టాక్ ఉంది.


Next Story

Most Viewed