జీవన్ రెడ్డి సెగతో మేల్కొన్న హైకమాండ్: పాతవారికి పదవులతో భరోసా

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-01 03:58:48  IST  )

కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వ్యవహారం తర్వాత అప్రమత్తమైన అధిష్టానం సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది.

జీవన్ రెడ్డి సెగతో మేల్కొన్న హైకమాండ్: పాతవారికి పదవులతో భరోసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఎఫెక్ట్ కనపుడుతున్నదని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే సీనియర్లకు గుర్తింపు ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని, పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే వి.హనుమంతరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించినట్లుగా తెలిసింది. రాబోయే రోజుల్లో మరికొందరు సీనియర్లకు పదవులు, నామినేటెడ్​పోస్టులు వస్తాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వీహెచ్‌ను కాంగ్రెస్ పార్టీ గతంలో మూడుసార్లు రాజ్యసభకు పంపించింది. 18 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా కొనసాగారు. అయితే 2014 తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయనకు అవకాశాలు దక్కలేదు. అయితే ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ వీహెచ్ విషయంలో పార్టీ ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. హనుమంతరావు ఇప్పటికీ ప్రతి రోజు గాంధీ‌భవన్‌కు రావడంతోపాటు ప్రజా సమస్యలను, బీసీల సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

ఆ ప్రచారానికి అడ్డుకట్ట..

జగిత్యాలకు చెందిన జీవన్‌రెడ్డి పార్టీ కీలక నేతలు బుజ్జిగించినా వినకుండా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగినట్లుగా తెలిసింది. పార్టీలో కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నదంటూ సాగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసే దిశగా రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఇందులో భాగంగా బీసీ నాయకుడు, సీనియర్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వీహెచ్‌కు ప్రభుత్వ సలహాదారుడిగా అవకాశం ఇవ్వడం ద్వారా సరైన గుర్తింపు ఇచ్చినట్లుగా పార్టీ నాయకులు, బీసీ నేతలు భావిస్తున్నారు. ఆలస్యమైనా తగిన గుర్తింపు లభించిందని అభిప్రాయపడుతున్నారు.

కొత్త, పాత కలిసిపోయేలా..

గత కొన్నిరోజులుగా పార్టీలో పాత, కొత్త అనే చర్చ నడుస్తోంది. పాతవారిని పట్టించుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల భర్తీ సమయంలో సీనియర్లను గుర్తు చేసేవారే లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తవారిని ఆహ్వానించాల్సిందే కానీ పాతవారిని విస్మరించవద్దని కోరుతున్నారు. తమ బాధను పార్టీ ముఖ్య నాయకుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్‌కు పదవులు, గుర్తింపు ఇవ్వడం.. అవి ఇవ్వలేకపోతే మరేదైనా ప్రత్యామ్నాయాలు చూపే విధంగా చేయాలని సూచిస్తున్నారు. వారిని పిలిపించి ఎందుకు పదవి ఇవ్వలేకపోయామనే విషయాన్ని వివరిస్తే కొంతవరకు వారి బాధ తగ్గుతుందని అంటున్నారు. లేదంటే వారు తీవ్ర అసంతృప్తితో వ్యతిరేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని, లేదా పార్టీలోనే ఉంటూ వ్యతిరేక, అసంతృప్తి వాదాన్ని ప్రతి రోజూ వినిపించడం ద్వారా ఇతర నాయకులు, కేడర్​ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Next Story