ఈ బుడ్డొడికి టాలెంట్ మాములుగా లేదుగా.. రెండేళ్లకే ప్రపంచ రికార్డు

by Yella Dhawani Reddy |

'పిట్ట కొంచెం.. కూత ఘనం' అనే సామెత వినే ఉంటారు. ఇది ఈ బుడ్డొడికి సరిగా సరిపోతుంది.

ఈ బుడ్డొడికి టాలెంట్ మాములుగా లేదుగా.. రెండేళ్లకే ప్రపంచ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: 'పిట్ట కొంచెం.. కూత ఘనం' అనే సామెత వినే ఉంటారు. ఇది ఈ బుడ్డొడికి సరిగా సరిపోతుంది. మాటలు కూడా సరిగా రాని వయసు కానీ.. జ్ఞాపశక్తి మాత్రం అద్భుతం. ఇంకా బడిబాట కూడా పట్టకముందే రాష్ట్రాల రాజధానుల పేర్లను చకచకా చెప్పేస్తూ రికార్డులు సాధించి ఔరా.! అనిపిస్తున్నాడు. మరి ఆ చిచ్చరపిడుగు గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

తెలంగాణలోని నిజామాబాద్‌లోని (Nizamabad) సీతరాంనగర్ కాలనీలో నివసించే రవికుమార్, అమూల్య దంపతులు. రవికుమార్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, అమూల్య గృహిణి. వీరికి వియాన్ (Viyan) అనే రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. వియాన్‌కు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచే తల్లి అమూల్య రాష్ట్రాల రాజధానుల పేర్లను సరదాగా నేర్పించడం ప్రారంభించింది. దీంతో ఆ చిన్నారి ఏ రాష్ట్ర రాజధాని పేరు అడిగినా క్షణాల్లో చెప్పే స్థాయికి చేరుకున్నాడు.

ఈ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న 'వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ (Worldwide Book of Records)' సంస్థ ప్రతినిధులు గత మే నెలలో నిజామాబాద్‌కు స్వయంగా వచ్చారు. వియాన్ ప్రతిభను ప్రత్యక్షంగా పరీక్షించి ఆశ్చర్యపోయారు. వారి ఎదుట కేవలం 41 సెకన్లలోనే 29 రాజధానుల పేర్లను వియాన్ చెప్పడంతో వారు రికార్డుకు ఎంపిక చేశారు. గురువారం ఇందుకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని తల్లిదండ్రులకు అందించారు. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సాధించిన వియాన్‌ను, అతడిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Next Story