20 ఏళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలోకి భారీ వాహనాల అనుమతి

by Muthe.Rajitha |

20 ఏళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలోకి భారీ వాహనాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

20 ఏళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలోకి భారీ వాహనాల అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్ : 20 ఏళ్ల తర్వాత కవ్వాల్ అభయారణ్యంలోకి భారీ వాహనాలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్థానిక ప్రజల అవసరాల కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని రహదారి గుండా భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలని నిరసనలు వ్యక్తం చేసారు. ఈ విషయంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై గత రెండు దశాబ్దాలుగా అటవీ శాఖ నిషేధం విధించింది.

వన్యప్రాణుల రక్షణకు, పర్యావరణ రక్షణ కోసం 2007లో జారీ చేసిన జీవో నం. 34357 ను అమలు చేస్తూ.. 27 జూలై 2013 నుండి అభయారణ్యంలోకి భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. ఇటీవలి నిరసనలు, ఎమ్మెల్యే ప్రత్యేక విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని, ఆగస్టు 5న జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశంలో భారీ వాహనాల రాకపోకల ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, వన్యప్రాణుల మరణాలు వంటి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని కేవలం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వరకు మాత్రమే భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడానికి అగీకరించింది.

దీంతో ఇకపై మంచిర్యాల నుండి నిర్మల్, ఉట్నూర్ నుండి మంచిర్యాల వరకు రోడ్లపై పరిమిత గంటల్లో భారీ వాహనాలు తిరగనున్నాయి. అయితే ఈ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు, నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారీ వాహనాలు అభయారణ్యంలో తిరగడం వన్యప్రాణులపై ప్రభావం చూపుతుందని, పులులు సంతానోత్పత్పి కోసం స్వేచ్ఛగా అడవుల్లో తిరగలేవని, మూగజీవాలు రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురయ్యి మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరోసారి ప్రభుత్వం, అటవీ శాఖ అధ్యయనం చేసి నిర్ణయం మార్చుకోవాలని కోరుతున్నారు.

Next Story