- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
చురుగ్గా రుతుపవనాల కదలిక:
నైరుతీ రుతుపవనాల కదలికలు చురుగ్గా కొనసాగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయని, ఆకాశం మేఘావ్రుతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో నేడు తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 9.6 కి.మీ ఎత్తువరకు విస్తరించి ఉంది. అల్ప పీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
సిద్దిపేట్ జిల్లా వర్గల్ లో 23 సెం.మీ వర్షాపాతం:
ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వర్గల్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. సోమవారం వర్గల్‌లో ఏకంగా 23 సెం.మీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ లో 22 సెం.మీ, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో 21 సెం.మీ, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 17 సెం.మీ, కామారెడ్డి జిల్లా పిట్లంలో 17 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 15 సెం.మీ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 15 సెం.మీ, మెదక్ జిల్లా టెక్మల్ లో 15 సెం.మీ, నిజామాబాద్ జిల్లా వర్నిలో 13 సెం.మీ, బోధన్ లో 13 సెం.మీ, మెదక్ జిల్లా పాపన్న పేట్ లో 12 సెం.మీ, కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో 11 సెం.మీ, సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ లో 10 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.
ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలకు సిద్ధమైందని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయా శాఖల అధికారులు తెలిపారు.






