- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతివృష్టితో అన్నదాతల అరిగోస.. 1.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు పది లక్షల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 1.50 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నీటిలో తేలియాడుతున్నాయి. కొన్ని చొట్ల వరి నాట్ల దశలోనే ఉండటంతో కూడా నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో పత్తికాయలు నేలపాలయ్యాయి. కాగా, వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చూసి అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రూ. లక్షలు అప్పులు తెచ్చి పంటలు వేస్తే.. భారీ వర్షాలతో తమ జీవితాలు అంధకారంలో పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వర్షాలతో వరి, పత్తి, మొక్కజోన్న, సోయాబీన్, కంది, పెసర, మినుము వంటి పంటల్లో కొన్ని రకాల చీడపీడలు ప్రమాదం ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
నష్టం అంచనాకు క్షేత్రస్థాయికి సిబ్బంది!
గ్రామాలకు వెళ్లి పంట నష్టానికి సంబంధించి వివరాలను సేకరించి, రెండు మూడు రోజుల్లో పంపాలని ఉన్నతాధికారులు మండల ఏఈఓ, ఏఈలను ఆదేశించినట్లు తెలిసింది. ఉన్న పంటలను రైతులు కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటునే భరోసాను అన్నదాతల్లో కల్పించాలని వారికి చెప్పినట్లు తెలిసింది. కాగా, భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పర్యటించారు. తామున్నామని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పలు ప్రాంతాలకు వెళ్లారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకో చర్చలు జరిపారు. అవసరమైతే అత్యవసర బృందాలు, హెలికాప్టర్లు వచ్చేలా చర్యలు చేపట్టారు.
పరిహారం కోసం రైతు సంఘాల డిమాండ్
గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలతో 28 జిల్లాల్లో 79,574 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల చొప్పన 79,216 మంది రైతులకు పరిహారం కింద రూ.79.57 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈసారి ఎకరానికి రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో రైతు సాగు చేసిన పంటలో 33 శాతానికే పరిహారం పంపిణీ చేసేవారని, ఈసారి 50 శాతానికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.






