భారీ వర్షాలు.. కృష్ణా నదికి ప్రారంభమైన వరద

by Malleboina Mahesh |

భారీ వర్షాలు.. కృష్ణా నదికి ప్రారంభమైన వరద
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అయినప్పటికి.. వచ్చి రాగానే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రుతుపవనాలు తెలంగాణ తాకనుండగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. గత రెండు రోజులుగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణా నది (Krishna river)కి శనివారం రాత్రి నుంచి స్వల్ప వరద ప్రారంభమైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు 4,750 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అలాగే 1,463 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు అంచనా వేశారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ఈ రోజు కూడా భారీ వర్ష సూచన ఉండటంతో మరికొద్ది రోజుల్లో జూరాల పూర్తి స్థాయిలో నిండి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెట్టనుంది. దీంతో కృష్ణా నది పరివాహక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story