- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టోల్ ప్లాజాలపై కనక వర్షం..! పదేళ్లలో కేంద్రానికి రూ.50 కోట్ల ప్రాఫిట్
హైవేలపై నిర్మించిన టోల్ గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైవేలపై నిర్మించిన టోల్ గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీతో ఈ రాబడి మరింత రెట్టింపు అవుతున్నది. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖజానా గలగలాడుతున్నది. రాష్ట్రాలు, ప్రధాన పట్టణాలు, నగరాలను అనుసంధానం చేసేందుకు నిర్మించిన జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరులుగా మారాయి. ఎన్ హెచ్ఏఐ హైదరాబాద్ పీఐయూ (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్) డివిజన్ పరిధిలోకి వచ్చే 8 టోల్ గేట్ల ద్వారా పదేళ్లలో సుమారు రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
హైదరాబాద్ డివిజన్ పరిధిలో హైదరాబాద్- విజయవాడను కలిపే హైవే నం. 65, హైదరాబాద్- బెంగుళూరు హైవే నం. 44, హైదరాబాద్- శ్రీశైలం హైవే నం.765, మహబూబ్ నగర్ - కోదాడ హైవే 167, హైదరాబాద్- బీజాపూర్ హైవే 163 రూట్లలో ఏర్పాటు చేసిన పలు టోల్ గేట్ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. అత్యధికంగా ఎన్ హెచ్-65, ఎన్ హెచ్-44పై ఏర్పాటుచేసిన టోల్ గేట్ల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. ఈ రెండు హైవేలపై రోజుకు సగటున 75వేల నుంచి 80వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఎన్ హెచ్-44పై రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా ద్వారా రోజుకు 78,594 వాహనాలు వచ్చిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా నుంచి పదేళ్లలో రూ.13.26 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది.
హెన్‌హెచ్-65పై మొత్తం మూడు చోట్ల టోల్ గేట్లను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా ద్వారా ప్రతినిత్యం 75,586 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఈ ఒక్క టోల్ ప్లాజా ద్వారా పదేళ్లలో రూ.15కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. సూర్యాపేట జిల్లా కేతిపల్లి మండలం కొర్లపహడ్ టోల్ గేట్ నుంచి రోజుకు 51,091 వాహనాలు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లు సమీపంలో ఏర్పాటుచేసిన టోల్ ప్లాజాల నుంచి 35,684 వెహికిల్స్ తిరుగుతున్నట్లు నమోదవుతున్నాయి. ఈ రెండు టోల్ గేట్ల ద్వారా పదేళ్లలో రూ.20కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా ఎన్ హెచ్-765, ఎన్ హెచ్-167, ఎన్ హెచ్-163పై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాలు భారీగా ఆదాయాన్ని వసూలు చేస్తున్నాయి.
విజయవాడ రూట్ బిజీబిజీ
ప్రతిరోజు రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ హైవేపై అత్యధికంగా రూ.35కోట్లకుపైగా టోల్ ఫీజు వసూలవుతున్నది. ఇది నాలుగు వరుసల రహదారి అయినప్పటికీ వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గం కావడంతో నిత్యం రద్దీ ఉంటుంది. ఇక పండగల సీజన్ వచ్చినా.. ఇతర ఉత్సవాలు నిర్వహించినా వాహనాల రద్దీ అంచనాలకు మించిపోతున్నది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కార్యక్రమాలు జరిగినా రాకపోకలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ హైవేపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల ద్వారా నిత్యం ఆదాయం వస్తున్నది.






