తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. 6 రోజుల పాటు దంచికొట్టనున్న వానలు!

by Ramesh Naini |

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. 6 రోజుల పాటు దంచికొట్టనున్న వానలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి, రాయలసీమ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా జూన్ 27 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు సూచించారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పిడుగుపాట్లు సంభవించే ప్రమాదం ఉన్నందున వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ సమీపంలో ఉండవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ప్రారంభమైనట్లు కనిపిస్తోందని, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

Next Story