తనిఖీలు చేస్తున్న టీడీవోను తొక్కేసిన టిప్పర్.. బీఆర్ఎస్ సీరియస్

by Prasad Jukanti |   (  Updated:2026-06-22 06:37:27  IST  )

భూపాలపల్లి డీటీఓ వెంకన్నపైకి టీప్పర్ దూసుకెళ్లిన ప్రమాదంపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. దీని వెనుక ఉన్న వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు.

తనిఖీలు చేస్తున్న టీడీవోను తొక్కేసిన టిప్పర్.. బీఆర్ఎస్ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రావాణా శాఖలో తీవ్ర విషాదం నింపిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్నను బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని దుర్మరణం చెందిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా? అని ప్రశ్నించారు. డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని, డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

నుజ్జు నుజ్జైన మృతదేహాం:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట పరకాల-భూపాలపల్లి హైవేపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా డీటీఓ వెంకన్న హైవేపై వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక బొగ్గు టిప్పర్ లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు వెంకన్న శరీరం నుజ్జునుజ్జయి, ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే వెంకన్న 15 రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చినట్లు తెలుస్తోంది. విధి నిర్వహణలో ఉన్న అధికారి ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

Next Story