తెలంగాణకు వడగాల్పుల హెచ్చరిక.. రేపటి నుంచి 10 రోజుల పాటు భానుడి భగభగలు

by Malleboina Mahesh |

తెలంగాణలో ఏప్రిల్ 12 నుండి 22 వరకు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక! కొన్ని చోట్ల 44°C దాటనున్న ఎండలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

తెలంగాణకు వడగాల్పుల హెచ్చరిక.. రేపటి నుంచి 10 రోజుల పాటు భానుడి భగభగలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటికే పెరిగిన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరగడంతో పాటు ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 22 వరకు రాష్ట్రమంతటా తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఎండల ప్రభావం అత్యధికంగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°C మార్కును కూడా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లోనూ సెగలు

వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా ఎండలు దంచికొట్టనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి వరుసగా 10 రోజుల పాటు నగరంలో 40°C నుండి 41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఈ పది రోజుల వ్యవధిలో వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉందని, అక్కడక్కడా చెదురుముదురు జల్లులు తప్ప పెద్దగా ఉపశమనం ఉండదని వాతావరణ నివేదిక స్పష్టం చేస్తోంది. తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story