హెల్త్‌కేర్ హబ్ స్పీడప్..వేలాది మందికి ఉపాధి

by velandi.Saikiran |

పల్సస్ గ్రూప్ ‘ఏఐ హెల్త్‌కేర్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్’ విస్తరణకు సుప్రీంకోర్టు తీర్పుతో కీలక ఊరట లభించింది.

హెల్త్‌కేర్ హబ్ స్పీడప్..వేలాది మందికి ఉపాధి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని మియాపూర్ సమీపంలో ఉన్న అమీన్‌పూర్‌లో అభివృద్ధి చెందుతున్న పల్సస్ గ్రూప్ ‘ఏఐ హెల్త్‌కేర్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్’ విస్తరణకు సుప్రీంకోర్టు తీర్పుతో కీలక ఊరట లభించింది. ప్రాజెక్టుకు ఉన్న ఐటీ/ఐటీఈఎస్ పార్క్, ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) హోదాలను అత్యున్నత న్యాయస్థానం కొనసాగించడంతో చట్టపరమైన అనిశ్చితులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రూ.500 కోట్ల వ్యయంతో 35 ఎకరాల్లో నిర్మిస్తున్న అమీన్‌పూర్ క్యాంపస్‌ను మరింత విస్తరించి, 6 వేల మందికి ప్రత్యక్షంగా, సుమారు 30వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పల్సస్ గ్రూప్ ప్రకటించింది. ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో కృత్రిమ మేధస్సు (ఏఐ), హెల్త్‌కేర్ టెక్నాలజీ, డిజిటల్ సేవల రంగాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయనున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడానికి ఈ తీర్పు దోహదపడనుంది. ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ కింద పార్లమెంట్‌లో నమోదైన వివరాల ప్రకారం.. పల్సస్ గ్రూప్‌నకు చెందిన ఒమిక్స్ ఇంటర్నేషనల్ ఇప్పటికే విశాఖపట్నంలో 6వేల ప్రత్యక్ష, 30వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించింది. అమీన్‌పూర్ కేంద్రంలోనూ ఇప్పటివరకు సుమారు 1,500 మందికి ఉపాధి కల్పించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థికాభివృద్ధికి సరికొత్త బూస్ట్..

తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు కేరాఫ్‌గా మారిన తరుణంలో.. పల్సస్ విస్తరణ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మరింత ఊతమివ్వనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కేంద్రం ద్వారా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పరచుకుని సరికొత్త ఆవిష్కరణలకు పల్సస్ శ్రీకారం చుట్టనుంది. అంతర్జాతీయంగా డేటా ఆధారిత వైద్య పరిష్కారాలు, క్లినికల్ రీసెర్చ్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమీన్‌పూర్ ప్రాజెక్టు భవిష్యత్తులో అత్యంత కీలక పాత్ర పోషించనుంది.

ఏఐ హెల్త్‌కేర్ హబ్‌గా మార్చడమే లక్ష్యం..

- డా. గెడెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూప్ సీఈవో

మియాపూర్ సమీపంలోని అమీన్‌పూర్ ప్రాజెక్టును సాంకేతిక అభివృద్ధి, ఉపాధి సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం. చట్టపరమైన సవాళ్ల వల్ల కొంత ఆలస్యం జరిగినప్పటికీ.. విశాఖపట్నం తరహాలోనే ఇక్కడ కూడా 6వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తాం. సుప్రీం తీర్పుతో ఐటీఈఎస్-ఎస్‌ఈజెడ్ హోదా ఖరారు కావడంతో, తెలంగాణలోనే ప్రముఖ ఏఐ హెల్త్‌కేర్, డిజిటల్ ఇన్నోవేషన్ క్యాంపస్‌గా దీన్ని తీర్చిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాం.

Next Story