85 శాతం సీట్లు కేటాయింపు.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ

by Ramesh Naini |

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.

85 శాతం సీట్లు కేటాయింపు.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి (Damodar Rajanarsimha) తెలంగాణ జూనియర్ డాక్టర్స్ (junior doctors) అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. మంగళవారం అసోసియేషన్‌ ప్రెసిడెంట్ ఐజాక్, జనరల్ సెక్రటరీ‌ అజయ్ నేతృత్వంలోని జూనియర్ డాక్టర్ల బృందం, మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని జూడాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ దశాబ్దకాల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర రాజనర్సింహకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానిక డాక్టర్లకు పీజీ సీట్లు పొందే అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని జూడాలు తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల బలోపేతానికి, నాణ్యమైన మెడికల్ విద్యను అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జూడాలు అభినందించారు. ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు పెంచడం, టీచింగ్ ఫ్యాకల్టీ నియామకం, జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ 15 శాతం పెంచిన విషయాలను జూడాలు గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కాలేజీల్లో సౌకర్యాలు పెరిగాయని, దీంతో ఇటీవల జరిగిన అసెస్‌మెంట్‌లో ఒక్క సీటును కూడా నేషనల్ మెడికల్ కమిషన్ తగ్గించలేదని జూడాలు గుర్తు చేశారు. కాలేజీల అభివృద్ధితో పీజీ, యూజీ సీట్లు అదనంగా వచ్చాయని, దీంతో తమకు అవకాశాలు పెరిగాయని డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని జూడాలు వెల్లడించారు.

Next Story