రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై మహిళ ప్రసవం.. వివరణ ఇచ్చిన ఆరోగ్యశాఖ

by Naga Rani Yarlagadda |

రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంపై మహిళ ప్రసవం అయిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది.

రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై మహిళ ప్రసవం.. వివరణ ఇచ్చిన ఆరోగ్యశాఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారంపై మహిళ ప్రసవం అయిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. 108 వాహనం కోసం కాల్ చేస్తే స్పందించనందునే గత్యంతరం లేక మహిళ ప్లాట్ ఫారంపై ప్రసవం జరిగినట్లు ప్రచురితమైన వార్తా కథనాలపై అధికారులు వివరణ ఇచ్చారు. మహేశ్వరి (29) ఈ నెల 22న తొలుత తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమయంలో, విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థన మేరకు 108 అంబులెన్స్ సేవలు తక్షణమే స్పందించాయని... అదే రోజు అర్ధరాత్రి 108 అంబులెన్స్ ద్వారా ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) తాండూరుకు సురక్షితంగా తరలించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు ఉదయం రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యుడి పర్యవేక్షణలో 108 అంబులెన్స్ ద్వారానే ఎంసీహెచ్, తాండూరు నుంచి హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సంబంధిత మహిళ, వైద్యుల సూచనలకు విరుద్ధంగా హాస్పిటల్ నుంచి వెళ్లిపోయారని... ఆమె స్వయంగా రైలులో తిరిగి తాండూరుకు ప్రయాణించినట్లు సమాచారముందన్నారు. ఈ నెల 23 అర్ధరాత్రి సమయంలో తాండూరు రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకున్న అనంతరం ఆమెకు ప్రసవ నొప్పులు ప్రారంభమై, స్టేషన్ ప్రాంగణంలో ప్రసవం జరిగినట్లు తెలిసిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అదేరోజు తెల్లవారుజామున 108 కాల్ సెంటర్‌కు కాల్ అందిందని... కాల్ అందిన వెంటనే 108 వ్యవస్థ స్పందించి తాండూరు అంబులెన్స్‌ను పంపించే ప్రయత్నం చేసిందన్నారు. అయితే అదే సమయానికి తాండూరు అంబులెన్స్ మరో అత్యవసర కేసు నిమిత్తం ఆదికిచర్ల గ్రామంలో సేవలందిస్తోందన్నారు. దీంతో ఆలస్యం లేకుండా సమీపంలో అందుబాటులో ఉన్న కొడంగల్ అంబులెన్స్‌ను ఈ కేసుకు కేటాయించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. అదే సమయంలో కాల్ చేసిన వ్యక్తి... అంబులెన్స్ బృందం మధ్య సమన్వయం కోసం కాన్ఫరెన్స్ కాల్ కూడా ఏర్పాటు చేశామన్నారు. అయితే, కొడంగల్ నుంచి అంబులెన్స్ చేరుకునే వరకు వేచి ఉండలేమని కాలర్ స్వయంగా తెలిపి తల్లి, నవజాత శిశువును ఆటోలో తరలించినట్లు కాల్ రికార్డింగ్‌లో స్పష్టంగా నమోదైందన్నారు. కాబట్టి 108 స్పందించలేదనే ప్రచారం పూర్తిగా వాస్తవ విరుద్ధమని అధికారులు తెలిపారు. పూర్తి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా 108 సేవలపై నిరాధార ఆరోపణలు చేయడంతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రమాదం ఉందన్నారు.

Next Story