ఆయన ఎవరికీ ‘చిక్కడు.. దొరకడు’: ఇరిగేషన్ శాఖలో హాట్ టాపిక్‌గా ఈఎన్సీ తీరు

by Kema Shiva Kumar |

తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ జనరల్ రమేశ్‌బాబు తీరు జలసౌధలో హాట్ టాపిక్‌గా మారింది.

ఆయన ఎవరికీ ‘చిక్కడు.. దొరకడు’: ఇరిగేషన్ శాఖలో హాట్ టాపిక్‌గా ఈఎన్సీ తీరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అత్యంత కీలకమైన నీటి పారుదల శాఖలో కీలక అధికారి అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ జనరల్) వైఖరి తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఆఫీసుకు వెళ్తే టైం ఇవ్వరు.. ఫోన్‌లో మాట్లాడరు.. ఇదీ ఆయన తీరు. ఫిబ్రవరి నెలలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇదే వైఖరిని అవలంబిస్తుండడంతో ఆయన వ్యవహారం ఎవరికీ అంతుచిక్కడం లేదు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో కీలక హోదాల్లో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, కీలక నిర్ణయాలు, నిర్మాణ పనులు, బిల్లులు, పరిపాలనా అంశాలు ముడిపడి ఉన్న శాఖలో ఉన్నతాధికారుల పాత్ర మరింత కీలకంగా ఉంటుంది. అయితే.. జలసౌధలో విధులు నిర్వహిస్తున్న ఈఎన్సీ జనరల్ (ఇంజినీర్-ఇన్-చీఫ్) రమేశ్‌బాబు వ్యవహారశైలి ఇప్పుడు శాఖలోనే కాకుండా కాంట్రాక్టర్లు, ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ చేస్తే స్పందన ఉండదని.. కార్యాలయానికి వెళ్తే కలిసే అవకాశం దొరకదని.. అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని పలువురు వాపోతున్నారు. శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై స్పష్టత కోసం ప్రయత్నించే వారికి ఈఎన్సీ రమేశ్‌బాబు అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యంగా మారిందన్న చర్చ సాగుతోంది.

విజిటింగ్ కార్డు పంపినా..

నీటి పారుదల శాఖ పరిధిలో కొనసాగుతున్న వివిధ పనులు, బిల్లుల చెల్లింపులు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు, అంచనాల ఆమోదాలు వంటి అంశాల కోసం ప్రతిరోజూ పలువురు కాంట్రాక్టర్లు జలసౌధకు వస్తుంటారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో తుది నిర్ణయాలు లేదా మార్గదర్శకాలు ఈఎన్సీ స్థాయి నుంచి రావాల్సి ఉంటుంది. అయితే.. సంబంధిత అధికారిని కలవడం చాలా కష్టంగా మారిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాల చుట్టూ తిరిగినా ‘సార్ మీటింగ్‌లో ఉన్నారు’, ‘ఇప్పుడే బయటకు వెళ్లారు’, ‘రేపు రండి’, ‘టైమ్ ఇస్తాం’ అనే సమాధానాలే అటెండర్ల నుంచి వినిపిస్తున్నాయని చెబుతున్నారు. కొందరు అయితే వారాల తరబడి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వాపోతున్నట్లు శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ విజిటింగ్ కార్డు పంపించినా.. స్లిప్ మీద పేరు రాసి పంపినా.. ఈఎన్సీ కనీసం కనికరించడం లేదని అంటున్నారు. ‘ఈ రోజు చాలా బిజీగా ఉన్నా. మాట్లాడడం వీలు కాదు. మళ్లీ ఎప్పుడైనా రండి’ అంటూ ఈఎన్సీ నుంచి సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇలా పదుల సంఖ్యలో విజిటింగ్ కార్డులు ఆయన వద్దకు పంపినా స్పందన లేకుండా పోయిందని వాపోతున్నారు. చివరికి మీడియా ప్రతినిధులు సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పనుల పురోగతిపై ప్రభావం..

ప్రభుత్వ శాఖల్లో అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించడం సహజం. అత్యవసర విషయాలు, ఫైళ్ల పురోగతి, అధికారిక వివరణలు, సాంకేతిక అంశాలపై సమాచారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ఫోన్ ద్వారా సంప్రదిస్తుంటారు. అయితే.. ఈఎన్సీ రమేశ్‌బాబుకు చేసే కాల్స్‌కు మాత్రం స్పందన రావడం అరుదుగా మారిందని పలువురు చెబుతున్నారు. కాల్స్‌కు స్పందించకపోవడం మాత్రమే కాదు, సందేశాలు పంపినా స్పందన లేకపోవడం వల్ల శాఖలోని వివిధ వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సమాచారం. కీలకమైన విషయాల్లోనూ సమయానికి నిర్ణయాలు లేకపోవడం వల్ల పనుల పురోగతిపై ప్రభావం పడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈఎన్సీ హోదాలో ఉన్న వారెవరూ ఇలా వ్యవహరించలేదని స్వయంగా కార్యాలయంలోనే చర్చ నడుస్తుండడం గమనార్హం. గతంలో పనిచేసిన ఏ ఈఎన్సీ అయినా అందరికీ సమయం ఇచ్చి మాట్లాడేవారని.. పనులు సైతం చకచకా పూర్తవుతుండేవన్న టాక్ వినిపిస్తోంది.

సారు.. అంత బిజీనా?

ఈఎన్సీ వ్యవహారశైలి ఇప్పుడు జలసౌధ కారిడార్లలో చర్చనీయాంశంగా మారింది. ‘సార్ నిజంగానే అంత బిజీనా?’, ‘అందరినీ దూరంగా ఉంచడమే లక్ష్యమా?’, ‘అసలు నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటున్నారు?’, ‘ఎవరికి అందుబాటులో ఉంటున్నారు?’ వంటి ప్రశ్నలు జలసౌధ స్టాఫ్ నుంచే వినిపిస్తున్నాయి. శాఖలోని కొందరు అధికారులు సైతం కీలక అంశాలపై ఈఎన్సీని సంప్రదించడం సులభం కాదని ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా చెప్పుకునే నీటి పారుదల శాఖలో ఇంజినీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారి వ్యవహారశైలిపై ఇంత చర్చ జరగడం అరుదైన విషయమని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు కాంట్రాక్టర్లు ఎదురుచూపులు.. మరోవైపు అధికారుల అసంతృప్తి.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే శాఖ పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story