చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చాడు.. సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-22 08:35:43  IST  )

చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీలు మార్చాడని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చాడు.. సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీలు మార్చాడని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నిన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ఆర్థిక ఆరాచకత్వం జరిగిందని రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాక్షాత్తు ఇటీవల రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు ప్రశంసించడం నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి పిలిచిన అతిథులే పొగడటం రుచించలేదా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందని అన్నారు. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో దేశానికే తలమానికంగా తెలంగాణను నిలిపారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో మూడు రెట్లు జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెరగడం వాస్తవం కదా అని హరీశ్ రావు అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ పెరిగినట్లుగా రేవంత్ రెడ్డే చెప్పారని.. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ కొనుగోలు చేసినట్లుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) బయట పెట్టాడని గుర్తు చేశారు. నిజాయితీగా త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం తమదని.. పుట్టుక, చదువు, నౌకరీ ఒకే చోట చేస్తున్నారని, రేపు ఎక్కడో తెలియదంటూ సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులు గడ్డిపరకల్లా త్యాగం చేసింది బీఆర్ఎస్ నాయకులని.. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని అన్నారు. కేసీఆర్ నిన్న ప్రెస్‌మీట్ పెట్టగానే వెంటనే రేవంత్ రెడ్డి చిట్‌చాట్ పెట్టడం.. ఆయన ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడో అర్థం అవుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Next Story