- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ విషయంలో కేసీఆర్ వ్యూహం మారిందా?
రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగులు ఎలా ఉంటాయో అంత సులువుగా అర్థం కావని అంటుంటారు.

దిశ,డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో సీఎం కేసీఆర్ అడుగులు ఎలా ఉంటాయో అంత సులువుగా అర్థం కావని అంటుంటారు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా ముఖ్యమంత్రి ఎవరిని ఎప్పుడు ఆదరిస్తారో ఎవరిని ఎప్పుడు దూరం పెడతారో అంచనా వేయడం అంత తేలికైన పని కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. తాజాగా కేసీఆర్ నిర్ణయం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. గతేడాది కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అంతలోనే మారిపోయిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరికి కారణం ఏంటనేది ఆసక్తిగా మారింది.
బుధవారం సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది. ఎన్టీఆర్ ఘాటులో ఆయన కుటుంబ సభ్యులు హాజరై నివాళి అర్పించారు. అయితే సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా మంతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడిన బీఆర్ఎస్ బృందం ఎన్టీఆర్ ఘాటుకు వెళ్లి సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. అంతే కాకుండా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం అయింది. ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని చెప్పడం హాట్ టాపిక్ అయింది. గతంలో ఎప్పుడూ ఈ విధంగా గులాబీ పార్టీ నేతలంతా ఇలా కలిసి కట్టుగా వచ్చి ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన సందర్భాలు లేకపోవటంతో నాటి పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమయింది.
అయితే ఆ సందర్భంలో గులాబీ నేతలు మాట్లాడుతూ ఎన్జీఆర్ రాజకీయాలకు అతీతమైన నేత అంటూ ప్రశంసలు కురిపించారు. గతంలో టీడీపీలో పని చేసి.. బీఆర్ఎస్‌లో చేరిన నేతలు ఎంపీ నామా నాగేశ్వర రావు నాయకత్వంలో మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేకానంద, మాగంటి గోపీనాధ్, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సహా పలువురు ఇతర నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి చెప్పిన మాటలు తెలుగు ప్రజలు ఇంకా మరువనేలేదు. కానీ ఇంతలో ఎన్టీఆర్ వర్ధంతిని బీఆర్ఎస్ నేతలు మరిచిపోవడం వెనుక గులాబీ పార్టీ రాజకీయ మతలబు ఏంటి అనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి అప్పట్లో బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు పొలోమంటూ ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారంటే ఇది వాళ్ళ సొంత నిర్ణయమై ఉండదని దీని వెనుక సీఎం కేసీఆర్ అనుమతి తప్పకుండా ఉండి ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ ఎనిమిది నెలల క్రితం ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తిన బీఆర్ఎస్ నేతలు వర్ధంతి సందర్భంగా కనీసం నివాళి అర్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంక్ కోసమే అప్పట్లో కేసీఆర్ ఎన్టీఆర్ జపం చేశారని తీర ఇప్పుడు వ్యూహం మార్చుకుని ఎన్టీఆర్ విషయంలో లైట్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.






