బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించను: హరీష్ రావు హెచ్చరిక

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించను: హరీష్ రావు హెచ్చరిక

బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించను: హరీష్ రావు హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో సీఎం రేవంత్‌రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందని.. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలను ప్రజలు ఇచ్చారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో గెలిచిన సర్పంచులు, అచ్చంపేట నియోజకవర్గం, సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు బుధవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు సర్పంచులను, అలాగే గజ్వేల్ సర్పంచులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందన్నారు.

మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారని.. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యిందని.. ఇక మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరిచాయని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్‌లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదని.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తున్నదని.. బహుశా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చని పేర్కొన్నారు. రెండేళ్లలో కచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. గెలిచిన సర్పంచులంతా ధైర్యంగా ఉండాలని.. గ్రామాలకు మంచి రోజులు వస్తాయన్నారు.

Next Story