Harish Rao: రైతులతో కేసీఆర్‍కు పేగు బంధం.. కాంగ్రెస్‍కు ఓటు బంధం: హరీశ్ రావు

by Prasad Jukanti |   (  Updated:2025-10-01 07:28:43  IST  )

ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, ఆత్మహత్యల దౌర్భాగ్యంతో ఉన్న తెలంగాణ స్వరాష్ట్రంలో సస్యశ్యామలమై విరాజిల్లిందని హరీశ్ రావు అన్నారు.

Harish Rao: రైతులతో కేసీఆర్‍కు పేగు బంధం.. కాంగ్రెస్‍కు  ఓటు బంధం: హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేసీఆర్‍కు (KCR) రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే కాంగ్రెస్‍కు ఉన్నది కేవలం ఓటు బంధం మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రైతు ఆత్మహత్యల (Farmer suicides) తెలంగాణను.. అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆర్ అని, దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించి సాగును బాగు చేసింది కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గిందని జాతీయ నేర గణాంక నివేదిక (NCRB Report) వెల్లడించిందని ఈ నివేదిక లెక్కలు.. కేసీఆర్ పాలన గురించి నోరు పారేసుకున్న వారికి చెంపపెట్టు సమాధానం అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు లాంటిదన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14 వ స్థానానికి పరిమితం అయిందని, 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51శాతం మాత్రమేనన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84 శాతం తగ్గాయని గుర్తు చేశారు. ఇవి మాటలు కాదని కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు అన్నారు. ఈ మేరకు బుధవారం తన ఎక్స్ వేదికగా హరీశ్ రావు గణాంకాలతో కూడిన పోస్టును చేశారు.

నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం:
రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితమే ఇదంతా అని హరీశ్ రావు అన్నారు. స్వరాష్ట్రంలో ఒక్కో పథకంతో వ్యవసాయ రంగానికి జీవం పోసి సాగును బాగు చేశారన్నారు. 'రుణమాఫీతో రైతన్నకు ధీమా దొరికింది రైతు బంధు బంధువు అయ్యింది. రైతు బీమా కొండంత భరోసా ఇచ్చింది. 24 గంటల ఉచిత విద్యుత్తు వెలుగులు నింపింది. పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం అందింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీరింది. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరిగింది. భూగర్భ జలాలు ఉబికి బీడు భూములను పంట పొలాలుగా మార్చింది' అన్నారు. ఉమ్మడి పాలనలో నిత్య దుర్భిక్షం, సాగు విధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యంతో ఉన్న తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపురాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై విరాజిల్లిందన్నారు. తెలంగాణను అన్నంగిన్నెగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ నిలిపారని ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణగా మార్చారన్నారు.
Next Story