బట్టలిప్పినం.. బట్టబయలు చేసినం: హరీష్ రావు

by Gantepaka Srikanth |

బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టి పోరాటం మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

బట్టలిప్పినం.. బట్టబయలు చేసినం: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల(Banakacharla Project) ముప్పును ముందుగా పసిగట్టి పోరాటం మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘మేము ముల్లుకర్ర కాదు బల్లెం పెట్టి పొడిస్తే గాని ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేవలేదు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి, ఎప్పటికప్పుడు హెచ్చరించినా ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించలేదు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తే పాత డేట్లు వేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్లు విడుదల చేశారు. మేం పోరాటం చేస్తున్న సమయంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో మీటింగ్ పెట్టింది. పోను పోను అనుకుంటూనే బనకచర్ల మీటింగ్‌కు రేవంత్ రెడ్డి వెళ్లారు. అపెక్స్ మీటింగ్‌కు కాకుండా వేరే ఏ రకమైన సమావేశానికి హాజరు కావొద్దని మేం ఆనాడు గట్టిగా హెచ్చరించినం. అయినా పోను అనుకుంటూనే వెళ్లారు. పెట్టను పెట్టను అనుకుంటూనే రేవంత్ రెడ్డి సంతకం కూడా పెట్టేశారు.

బట్టలిప్పినం. బట్టబయలు చేసినం..

మేం నిలదీస్తే, నిలబెట్టి కడిగేస్తే బనకచర్ల మీటింగ్ ఎజెండాలోనే లేదని, కనుక చర్చ జరిగే ప్రసక్తే లేదని డైలాగులు కొట్టారు. మేం ఎజెండా బయట పెట్టి బట్టలిప్పినం. బట్టబయలు చేసినం.. దాంతో పాటు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అసలు బండారం బయట పెట్టారు. బనకచర్లపై చర్చ జరిగిందని, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసేందుకు కమిటీ ఏర్పాటు అయ్యిందని మీడియా ముఖంగా చెప్పారు. బనకచర్ల వలన కృష్ణానది నీటిలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు నీటి వాటా దక్కకుండా చేసేందుకు నల్లమల సాగర్‌కు చంద్రబాబు తెరలేపారు. 16 జూలై 2025న రేవంత్ రెడ్డి, చంద్రబాబు అంగీకరించిన విధంగా ఏపీ ప్రభుత్వం 15 డిసెంబర్ 2025 న కమిటీ వేస్తే తెలంగాణ ప్రభుత్వం 23 డిసెంబర్ 2025 నాడు వేసింది. ఇరు రాష్ట్రాలు పంపిన పేర్లతో కేంద్ర ప్రభుత్వ అధికారులను చేర్చి నేడు తెలంగాణ, ఏపీల మధ్య నీటి వాటా పంపిణీ కోసం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఖరారు చేసింది.

రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు

ఏపీ కమిటీలో ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు ఇంజినీర్లు ఉంటే తెలంగాణ కమిటీలో ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక్క ఇంజినీరింగ్ అధికారి మాత్రమే ఉన్నారు. ఏపీ కమిటీలో ఐఎస్ అండ్ డబ్ల్యూ ఆర్‌లో అనుభవం ఉన్న అధికారి ఉంటే తెలంగాణ కమిటీలో ఐఎస్ అండ్ డబ్ల్యూ ఆర్‌లో అనుభవం లేని అధికారి ఉండటం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది. ఈ కమిటీ ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు మూడు నెలల్లో పూర్తి చేయడం అంటే మూడు నెలల్లో నల్లమల సాగర్‌కు ఆమోదం తెలపడమే. ఇది రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా తెలంగాణకు నష్టం చేసి ఏపీకి మేలు చేసే చర్యే. ఇక నల్లమల సాగర్ టెండర్ విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం 11 డిసెంబర్ 2025 చివరి తేదీతో టెండర్ వేస్తే టెండర్ చివరి తేదీ అయిపోయాక 16 డిసెంబర్ 2025 నాడు సుప్రీంకోర్టుకు వెళ్లడమంటే రేవంత్ సర్కార్ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలపడానికే అని స్పష్టమైంది. టెండర్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి డీపీఆర్ టెండర్ ప్రక్రియను ఆపేందుకు స్టే తెచ్చి ఉంటే టెండర్ ఖరారయ్యేదే కాదు.. నేడు టెండర్ ప్రక్రియ ఖరారవ్వడమే కాకుండా ఐఐసీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు‌కు టెండర్ ఖరారు అయ్యేది కాదు. ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి కుట్రే. ముమ్మాటికీ తెలంగాణకు చేసిన ద్రోహమే’’ అని హరీష్ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story