విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర.. హరీష్ రావు సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర.. హరీష్ రావు సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూముల వేలంపై మారిన రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొన్నదని అన్నారు.

‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలు చేసి ఇపుడు వేల కోట్ల విలువైన భూములను వేలం వేసేందుకు తెరలేపాడని అన్నారు. ప్రభుత్వ భూములను అమ్మబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించి మూడు నెలలైనా గడవక ముందే విలువైన ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

పవిత్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను నీటి మూటలు చేస్తూ, నిధుల సమీకరణ పేరుతో ఇప్పుడు నిస్సిగ్గుగా భూములను అడ్డికి పావుశేరుకు అమ్ముతుండటం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతున్నదని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ పేరిట వేలం పాట నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియమకానికి (ఆర్ఎఫ్‌పీ) గత నెల 28న టెండర్లు పిలవడం దిగజారుడు తనానికి పరాకాష్టని అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సర్వే నంబర్ 25 పరిధిలోని 400 ఎకరాలను బ్యాంకర్లకు తనఖా పెట్టిన సమయంలో ప్రభుత్వం 25 కోట్లకు ఎకరం చొప్పున రూ.10వేల కోట్లు ఇప్పటికే సమీకరించింది. ఇప్పుడు ఇదే భూమిని వేలం వేసి దాదాపు రూ.30వేల కోట్లను సమీకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఒకవైపు బ్యాంకులో తనఖా పెట్టడం, మరోవైపు తనఖా పెట్టిన అవే భూములను వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాలాకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు.

‘డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధిని ఆధారాలతో సహా బయటపెట్టాను. జూన్ 26, 2024 నాడు విడుదల చేసిన జీవో ఎంఎస్ 54తో ఎకరానికి 75 కోట్ల చొప్పున మొత్తం 30వేల కోట్ల విలువైన భూములను అమ్ముతున్నారని నేను అసెంబ్లీలో నిలదీస్తే.. అలాంటిదేమి లేదని, టీజీఐఐసీకి చేస్తున్న బూ బదలాయింపు మాత్రమేనని బుకాయించారు. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు తప్పుడు సమాధానం చెప్పి, సభను, సభ్యులను తప్పుదోవ పట్టించారు. అసెంబ్లీ అయ్యిందో, లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి రూ. 10వేల కోట్ల రుణం తెచ్చుకున్నరు. మల్లా అసెంబ్లీ మొదలయ్యే లోపే ఇప్పుడు అదే భూమిని అమ్మకానికి టెండర్లు పిలుస్తున్నరు’ అని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story