కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు వల్ల 8 ప్రాణాలు బలి: హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవాస్తవాలకు ఈ పుస్తకాలే సమాధానం చెబుతాయాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు వల్ల 8 ప్రాణాలు బలి: హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవాస్తవాలకు ఈ పుస్తకాలే సమాధానం చెబుతాయాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ సాగునీటి రంగాన్ని దెబ్బతీసిందని ఆయకట్టుకు గుండు సున్నా మిగిలిందని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానంలో అనేక విజయాలు సాధించమని గుర్తుచేశారు. తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు : ప్రశ్నలు - విమర్శలు - వక్రీకరణలు - వివరణలు’’, ‘‘ సాగునీటి రంగంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానం’’ పుస్తకాలను హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని తెలిపారు.

2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండి కూడా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. వాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాడారు సర్వే చేసిన తర్వాత మేడిగడ్డ వద్ద నీళ్లు ఉన్నాయని సర్వే రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. స్టేట్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణాన్ని తప్పు పట్టలేదు. మేడిగడ్డ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే విధానంపై వారు అభ్యంతరం చెప్పారే కానీ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టవద్దు అని అనలేదని తెలిపారు. భారతదేశంలో ఐదు రెట్లు, పది రెట్లు ప్రాజెక్టు ఖర్చు పెరగకుండా ఏ ప్రాజెక్ట్ కట్టింది లేదని అన్నారు. నాగార్జునసాగర్‌కి పది రెట్లు కాస్ట్ , శ్రీశైలం ప్రాజెక్టుకి 100 రెట్లు కాస్ట్, జూరాల, పులిచింతల ఇలా అన్ని ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చు రెట్టింపు అయిందని అన్నారు. ఈ రాష్ట్రంలో లోయెస్ట్ ఎస్కలేషన్‌తో పూర్తయింది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సర్వేకు 670 కోట్లు చెల్లించారని, పీసీ ఘోష్ కమిషన్ కి తెలిసిందని వక్రీకరించిన వార్తలు పేపర్లలో వచ్చాయని తెలిపారు.

కాళేశ్వరం కూలింది అని దుష్ప్రచారం చేస్తూనే మల్లన్న సాగర్ నుండి తాగునీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు టెండర్లను రేవంత్ రెడ్డి సర్కారు పిలిచింది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మీరు కట్టిన ప్రాజెక్టులకు కేటాయించిన నీటి వాటా 299 టీఎంసీలు మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్లో 512 టీఎంసీల ప్రాజెక్టులను కట్టారని అన్నారు. ఎస్ఎల్బీసీలో కాంగ్రెస్ పార్టీ తొందరపాటుకు 8 ప్రాణాలు పోయాయని అన్నారు. ఈ కార్యక్రమలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాష్, అంబేద్కర్ వర్సిటీ మాజీ వీసీ కె.సీతారామారావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షులు జి.దేవీ ప్రసాదరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, రిటైర్డు ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టి.వెంకటేశం, సీనియర్ జర్నలిస్టు పి.వేణుగోపాల స్వామి, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, పాల్గొన్నారు.

Next Story