తెలంగాణలో వరి, పత్తి వైపు రైతుల మొగ్గు

by Malleboina Mahesh |

తెలంగాణలో వరి, పత్తి సాగు మూడింతలు పెరగగా, పండ్లు, కూరగాయల సాగు తీవ్రంగా క్షీణించింది. మద్దతు ధర లేకపోవడం, వన్యప్రాణుల బెడద వల్ల ప్రత్యామ్నాయ పంటలకు రైతులు దూరం.

తెలంగాణలో వరి, పత్తి వైపు రైతుల మొగ్గు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాల పంటల సాగు భారీగా తగ్గింది. వరి, పత్తి పంట సాగు ఆశించిన దానికంటే మూడు రెట్లు పెరిగింది. 2013 ఏడాదిలో వరి 49 లక్షల ఎకరాలు సాగు చేయగా ప్రస్తుతం 127 లక్షల ఎకరాలకు చేరింది. ఉద్యాన పంటల సాగు 19.82 లక్షల ఎకరాలు ఉండగా ప్రస్తుతం 12.46 లక్షలకు తగ్గింది. దీంతో పండ్లు, కూరగాయలు, పూలు, నూనె గింజలు, చిరుధాన్యాలు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పంటల వైపు రైతులు మొగ్గు చూపితే ఆశించిన ఆదాయంతో ఆర్థికంగా ఎదగవచ్చు. వరి, పత్తి పంటను రెండు సీజన్లు సాగు చేస్తే భూమి సారం తగ్గి ఏటేటా దిగుబడి తగ్గుతుంది. చిరు ధాన్యాలను సాగు చేస్తే నీటి వనరులు పరిరక్షించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పెంచి, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం బలోపేతం చేయవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వన్యప్రాణుల బెడద

రాష్ట్రవ్యాప్తంగా పంటల మార్పిడి విజయవంతంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు, మార్కెట్లు, రైతుల సమన్వయం అవసరం ఉంది. ఇటీవల రైతు కమిషన్​వివిధ పంటలపై సర్వే చేయగా ప్రత్యామ్నాయ పంటల పరిస్థితి గుర్తించింది. కనీస మద్దతు ధర, ప్రభుత్వ సేకరణ పై ఆధారపడి వరి, పత్తి పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర, నిర్దిష్టమైన ధర లేకపోవడం వల్ల కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం తగ్గుతుంది. కోతులు, అడవి పందులు, జింకల వంటి వన్యప్రాణుల బెడద పంటల మార్పిడిపై ప్రభావం చూపుతుంది. పప్పుధాన్యాలు, కూరగాయల విత్తన వ్యవస్థల కొరతతో పాటు ఎగుమతులకు తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం లేదనే అంశాలను అధికారులు గుర్తించారు.

ఆహార భద్రత అవసరం

సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్తు ఆహార భద్రత కోసం పంటల మార్పిడి అత్యవసరం. ఉద్యాన పంటలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ ఆదాయానికి గణనీయంగా తోడ్పడుతాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయం గాడి తప్పింది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యానవన పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజల విస్తరణతో ఒకే పంట వేయడం తో వచ్చే నష్టాలను తగ్గించవచ్చు. వరి, పత్తి పంటలకు కేంద్రం మద్దతు ధరలు నిర్ణయిస్తుంది. ఈ పంటలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రెండు పంటల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో పంటల మార్పిడి అత్యవసరం. అందులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటల వంటి అధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి మద్దతు ధర, మార్కెట్ సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి రైతు అవగాహనతో కూడిన సమగ్ర విధానం అవసరం ఉందంటున్నారు. ఆరుతడి పంటలైన పప్పు ధాన్యాలు, నూనె పంటలు, చిరుధాన్యాల వంటి ఇతర పంటలు సాగు చేసేలా చూడాలి. పసుపు, చెరుకు వంటి సాంప్రదాయ పంటల సాగు పెరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలి. దీనిని ఆచరణలో పెట్టడానికి వ్యవసాయ కమిషన్ ప్రతిపాదనలు సూచిస్తుంది.

అవగాహన అనివార్యం

వరి సాగు గణనీయంగా పెరగడంతో కొనుగోలు చేయడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు 12 ఏళ్ల క్రితం పండ్లతోటలు 9.11 లక్షల ఎకరాల సాగు చేయగా ప్రస్తుతం 4.48 లక్షలకు చేరింది. కూరగాయలు 5.52 లక్షల నుంచి 1.02 లక్షల ఎకరాలకు తగ్గింది. పూల తోటలు 17,220 నుంచి 6248 ఎకరాలు, పసుపు 1.52 లక్షల ఎకరాల నుంచి 42,246 ఎకరాలు, పప్పు ధాన్యాలు 10.20 లక్షల నుంచి 8.83 లక్షల ఎకరాలు, నూనె గింజలు 12.41 లక్షల ఎకరాల నుంచి 7.13 లక్షల ఎకరాలు, చిరుధాన్యాలు 19.58 లక్షల నుంచి 18.84 లక్షల ఎకరాలకు చేరింది. ఉద్యాన పంటలు 19.82 లక్షల ఎకరాల నుంచి 12.46లక్షల ఎకరాలకు పడిపోయాయి. ప్రభుత్వం ఈ పంటలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు పలు రకాల రాయితీలు, పంటలపై వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తే ప్రత్యామ్నాయ పంటల సాగు సాధ్యమవుతుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story