సింగన్నగూడెంలో లాటరీ తీసి రెండేళ్లైనా అందని ఇండ్లు..

by Kodari Anjali |

పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది.

సింగన్నగూడెంలో లాటరీ తీసి రెండేళ్లైనా అందని ఇండ్లు..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ‘ఇదిగో ఇ ఇస్తాం.. అదిగో అందిస్తాం’ అంటూ పాలకులు, అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారు సింగన్నగూడెం చౌరస్తా వద్ద నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగి సుమారు రెండేళ్లు దాటుతున్నా.. ఇంతవరకు చేతికి తాళాలు ఇవ్వకపోవడంతో పేదల సహనం నశించింది. మౌలిక వసతుల కల్పన కోసం నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు తీవ్ర ఉద్వేగ వాతావరణం మధ్య లబ్ధిదారులు తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ఫ్లాట్లను సామూహికంగా ఆక్రమించుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

ఆక్రమణలతో దద్దరిల్లిన కాలనీ..

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారు సింగన్నగూడెం చౌరస్తా వద్ద నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. చాలా కాలంగా ఇళ్ల కేటాయింపుపై ఎదురుచూస్తున్న లబ్ధిదారులు బుధవారం ఉదయం ఒక్కసారిగా సింగన్నగూడెం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు చేరుకున్నారు. తమకు లాటరీలో వచ్చిన ఫ్లాట్లలోకి వెళ్లి స్వచ్ఛందంగా శుభ్రం చేసుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లబ్ధిదారులను సముదాయించే ప్రయత్నం చేశారు.

ఆర్డీవోకు ‘లబ్ధిదారుల’ గోడు..

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఆర్డీవో మాలి కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్ మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వారికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ పనులు జరుగుతున్నాయని, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులను నత్తనడకన సాగిస్తున్నారని, తమ ఇళ్లను తమకి ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు వేచి“చూడాలని అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చే శారు. దీనిపై స్పందించిన ఆర్డీవో కృష్ణారెడ్డి ఈ సమస్యపై ఉన్నత అధికారులతో చర్చించి వీలు అయినంత త్వరలో సమస్యకు పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దీంతో లబ్ధిదారులు తాత్కాలికంగా శాంతించారు.

వివాదాల నిలయంగా 'సింగన్నగూడెం' ప్రాజెక్ట్..

సింగన్నగూడెం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల చుట్టూ వివాదాలు ముసురుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఐదారు ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

సాంఘిక విద్రోహ చర్యల అడ్డాగా:...

గతంలో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఈ ఇళ్లు నిరుపయోగంగా మారాయి. పిచ్చిమొక్కలు మొలిచి, రాత్రి వేళల్లో తాగుబోతులకు, జూదరులకు, సాంఘిక విద్రోహ చర్యలకు కేంద్రంగా మారాయంటూ గతంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.

కలెక్టరేట్ ముట్టడి - ధర్నాలు:

గతంలో 'డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల పరిరక్షణ సమితి' ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా జరిగింది. పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి, ఏళ్ల తరబడి కాలయాపన చేయడంపై లబ్ధిదారులు అప్పట్లోనే రోడ్లెక్కి నిరసనలు తెలిపారు.

ఈ నెలలోనైనా ఇళ్లు అందడం సాధ్యమేనా ?

గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఈ నెలలోనైనా లబ్ధిదారులకు అందడం కష్టంగానే కనిపిస్తోంది. ఇటీవల వీటిపై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపికతో పాటు, ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను గడువు విధించింది. కానీ, మే నెల ముగిసి జూన్ వచ్చినా పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులలో ఆందోళన తీవ్రమైంది.

Next Story