- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నది ఒడ్డున ఆరిపోని కన్నీళ్లు.. జిల్లాలో ఒకే రోజు మూడు వేర్వేరు జల ప్రమాదాలు.. ఆరుగురు మృతి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మూడు వేర్వేరు జల ప్రమాదాలు ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన మూడు వేర్వేరు జల ప్రమాదాలు ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. బాన్సువాడ మండలం బొల్లక్‌పల్లి ఎల్లమ్మ గుడి వద్ద మంజీరా నదిలో మునిగి పర్మల్ల గ్రామానికి చెందిన తల్లి, కూతురు చనిపోయారు. భీంగల్ మండలంలో ఆడుకుంటూ బ్రాహ్మణ కుంటలోకి దిగిన ముగ్గురు చిన్నారులు ఈత రాక నీటిలోనే ఊపిరి వదిలేశారు. గంటల తరబడి వెతికిన గజ ఈతగాళ్లు చిన్నారుల చల్లబడిన దేహాలను ఒడ్డుకు చేర్చడంతో వడ్డెర కాలనీ మూగబోయింది. ఆర్మూర్ పట్టణ శివారు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వలస కూలీ వెంకట సుబ్బయ్య ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. వేసవి సెలవుల తరుణంలో పిల్లలు చెప్పకుండా నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులే నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన అనిత (38), తన కూతురు శివాని (13)తో కలిసి పుట్టింటి పండుగకు వచ్చింది. శుక్రవారం ఉదయం బాన్సువాడ మండలం బొల్లక్ పల్లి ఎల్లమ్మ గుడి వద్ద మొక్కులు తీర్చుకునేందుకు బంధువులతో కలిసి మంజీరా నదికి వెళ్లారు. అక్కడ పూజకు ముందు స్నానం చేద్దామని నదిలోకి దిగిన తల్లీకూతుళ్లు, లోతు అంచనా వేయలేక నీటిలో మునిగి అక్కడికక్కడే శవాలయ్యారు. పండుగ పూట ఇద్దరు నదిలో కలిసిపోవడంతో భర్త నర్సింహులు, కొడుకు శ్రీశాంత్ రోదనలు మిన్నంటాయి.
కుంట ఊబిలో ముగ్గురు చిన్నారులు..
భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట వడ్డెర కాలనీకి చెందిన మహేష్ (5), హరీష్ (10), వర్షిణి (4) అనే ముగ్గురు చిన్నారులు ఆడుకుంటూ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్దకు వెళ్లారు. ఎండ వేడికి కాసేపు నీళ్లలో ఆడుకుందామని దిగిన ఆ పసి ప్రాణాలు, లోపల ఉన్న ఊబిలోకి లాగేయడంతో ఊపిరాడక చనిపోయారు. పిల్లలు ఎంతకూ రాకపోవడంతో తండ్రి సురేష్ పోలీసులను ఆశ్రయించగా, గజ ఈతగాళ్లు వారి మృతదేహాలను బయటకు తీశారు. ఒకే ఇంటికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకేసారి శవాలై రావడం ఆ కాలనీని మూగబోయేలా చేసింది.
వలస కూలీ దుర్మరణం..
నెల్లూరు జిల్లా నుంచి ఆర్మూర్ పట్టణానికి వలస వచ్చిన చౌటూరు వెంకట సుబ్బయ్య (32) కూలి పనులు చేసుకుంటూ ఈసపల్లిలో బతుకుతున్నాడు. శుక్రవారం కాస్త విరామం దొరకడంతో పట్టణ శివారు చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాళ్లు జారి నీటిలో పడిపోవడంతో ఈత రాక మరణించాడు. బతుకుదెరువు కోసం వచ్చిన చోటే భర్త నూరేళ్ల జీవితం ముగిసిపోవడంతో ఆ భార్య ఒంటరిదైపోయింది.
తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి!
నీటి జలాశయాలు కాస్త జాగ్రత్త తప్పితే ఎలా మృత్యుపాశాలుగా మారుతాయో ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. ఒకే రోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం.. అందులోనూ ఐదుగురు ఒకే కుటుంబాలకు చెందిన వారు కావడం ఉమ్మడి జిల్లా ప్రజల మనసులను కలచివేస్తోంది. ఆయా కుటుంబాలకు కాలం ఏనాటికీ రాని ఆ ఇద్దరు అమ్మలను, నలుగురు బిడ్డలను తిరిగి ఇవ్వలేదు.. కేవలం మిగిల్చించింది ఆరిపోని కన్నీటి జ్ఞాపకాలు మాత్రమే!. చిన్నారులు ఇప్పుడు వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్న తరుణం. పిల్లలు నీళ్లలో ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఇంట్లో చెపితే వద్దంటారనే ఉద్దేశంతో చెప్పకుండా చెరువుల్లోకో, కుంటల్లోకో వెళుతుంటారు. ఈ ప్రమాదాల నుంచి తమ బిడ్డలను సురక్షితంగా కాపాడుకోవాలంటే పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిరంతరం కన్నేసి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగాక బాధ పడే కన్నా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం.






