- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు: హరీశ్ రావు ఫైర్
‘నల్లమల బిడ్డకు నల్లమల ఎక్కడుందో తెలియదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై బేసిక్ తెలియదు. బేసిన్లు తెలియవు’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నల్లమల బిడ్డకు నల్లమల ఎక్కడుందో తెలియదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై బేసిక్ తెలియదు. బేసిన్లు తెలియవు’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ చూశారని.. అసలు విషయాన్ని పక్కనపెట్టి సొల్లు వాగుడు వాగారని.. బేసిన్‌ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా తన అవివేకాన్ని చాటుకున్నారని అన్నారు. బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్ సీఎంకు.. బేసిన్ల మీద లేదని ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని పేర్కొన్నారు. దేశం ముందు పరువు పోయే పరిస్థితి దాపురించిందని.. అవగాహన లేకుండా మాట్లాడడం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమని అన్నారు. రేవంత్ అంతులేని అజ్ఞానంతో.. మూర్తిభవించిన మూర్ఖత్వంతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో ఆయనకు తెలియదని.. బనకచర్ల ఏ బేసిన్‌లో కడుతున్నారో కూడా తెలియదని.. దేవాదుల కూడా గోదావరి బేసిన్ కదా అని కొత్తగా అడుగుతున్నారని.. ఇక రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల నుండి పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ.. కేంద్ర జల మంత్రిని కలుస్తూ ఏపీ ముందుకు పోతుంటే మన సీఎం మాత్రం అమాయకంగా అడుగుతున్నారని అన్నారు. ‘నీకు ఎంత కమిట్మెంట్ ఉందో.. నీకు ఎంత సిన్సియార్టీ ఉందో.. ఆరు నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టావో నిన్న బయటపడ్డది’ అని ఆరోపించారు. మాట్లాడితే నల్లమల్ల బిడ్డ అంటాడని.. తొక్కుకుంటా వచ్చిన అంటాడని.. నల్లమల్ల ఎక్కడ ఉందో కూడా తెలియనది ఎద్దేవా చేశారు. ఆయన నల్లమల్ల బిడ్డ కాదని.. వెకిలి మాటల వెర్రిబిడ్డ అని అన్నారు. రేవంత్‌లో విషం ఎక్కువ.. విషయం తక్కువ అని విమర్శించారు.
అబద్ధాలకు వేదికగా అఖిలపక్షం..
ఆంధ్ర దోపిడీ అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యమని అడిగితే.. అది చేతగాక రేవంత్‌రెడ్డి అడ్డూఅదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని పారించారని హరీశ్‌రావు ఆరోపించారు. అసలు విషయం మాట్లాడకుండా మొత్తం విషయాన్ని పక్కదోవ పట్టించి అబద్ధాలకు వేదికగా మార్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా రాజకీయ వేదికగా మార్చారని అన్నారు. తాము ఉద్యమాల నుంచి వచ్చామని.. అడ్డమైన తొక్కులు తొక్కుతూ రాలేదని అన్నారు. బూతులు తెలుసుకున్నంత సులువు బేసిన్ల గురించి తెలుసుకోవడం కాదని అన్నారు. సీఎం ఇలా ఉంటే.. ఆయన సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ సైతం అంతకంటే గొప్ప ఘనుడిలా ఉన్నారని పేర్కొన్నారు. బనకచర్ల విషయంలో మొద్దునిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీ అని.. తాను రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాయిస్తే పాత డేట్లు వేసి ఉత్తరాలు విడుదల చేశారని ఆరోపించారు.
అలా అనడానికి మీ అయ్య జాగీరా..!
‘గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అని రేవంత్ చెబుతున్నారు. మీ అయ్య జాగీరా. నువ్వేమైనా రాజువా. నువ్వు ఎలా చెబుతావు. ఇది డెమొక్రటిక్ ప్రభుత్వం. స్టేట్ ఆఫ్ తెలంగాణ. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్. మీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ముందు రేవంత్ రెడ్డి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజెంటేషన్‌లో అధికారి సుబ్రమణ్య ప్రసాద్ స్పష్టంగా చెప్పారని.. 968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టుగా రూపకల్పన జరిగిందని, అందులో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబును అడుక్కునే బుద్ధి ఇంకా పోతలేదని.. చంద్రబాబు దయా దక్షిణాల మీద బతికే బుద్ధి పోతలేదని అన్నారు. వెయ్యి టీఎంసీలు చంద్రబాబు ఇచ్చేది ఏంటని.. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారని.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 968లో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామని వెల్లడించారు. వీటన్నింటిని చూస్తుంటే బనకచర్ల కట్టుకోమని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నరా అని ప్రశ్నించారు. సోయి ఉండి మాట్లాడుతున్నారా సోయి లేకుండా మాట్లాడుతున్నారా అని ఫైర్ అయ్యారు. అటు కృష్ణా విషయంలోనూ అజ్ఞానం లేకుండా మాట్లాడారని అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన ద్రోహానికి ఉరితీసినా తప్పులేదని అన్నారు.
కాంగ్రెస్ దరిద్రం వల్లే 299 టీఎంసీలు..
కేసీఆర్ తెలంగాణ కోసం, నీళ్ల కోసం ఎంతో పోరాటం చేశారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 750 టీఎంసీల నీళ్లు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించామని.. సెక్షన్ 3 కోసం పోరాడారని అన్నారు. కానీ.. కాంగ్రెస్ దరిద్రం వల్లే కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి 299 టీఎంసీలే వచ్చాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల.. నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల ఈ నిర్ణయం జరిగిందన్నారు. ఆ పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ చెబుతున్నది ట్రిబ్యునల్‌ను ఎఫెక్ట్ చేయదా? 500 చాలని ఎలా అంటావు? మన వాదనకు విలువ ఉంటదా?’ అని నిలదీశారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు, ఏపీకి రాసిస్తా అంటూ రాష్ట్ర ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఈరోజు చంద్రబాబు అనే భగవంతుడికి రేవంత్ అనే భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తిలా ఈ ఆదిత్యనాథ్ ఉన్నారని ఆరోపించారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను వక్రీకరించారు..
3000 టీఎంసీల అనే బ్రహ్మపదార్థం కేసీఆర్ కనిపెట్టారని రేవంత్ ఆరోపించారని.. గోదావరి నుండి ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తాయని 60 ఏళ్ల లెక్కలు సీడబ్ల్యూసీ చెబుతున్నదని.. దాని ప్రకారం ఏటా కనీసం 3,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఇదే విషయాన్ని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో చెప్పారని.. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలని రెండు రాష్ట్రాలకు లాభం చేకూరేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. దీనిని సైతం సీఎం వక్రీకరించారని ఆరోపించారు. బనకచర్ల అనే ముచ్చట ఇక్కడ లేదన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పది అబద్ధాలు మాట్లాడడం రేవంత్‌రెడ్డి అలవాటుగా మారిందన్నారు. జగన్‌తో ఏం మాట్లాడామో ఎజెండా ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. తమ హయాంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదనడం అవాస్తమని అన్నారు. 2004-14 కాంగ్రెస్ హయాంలో 6.64 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేదని.. 2014- 23 మద్యలో బీఆర్ఎస్ దానిని 48.74 లక్షల ఎకరాలకు పెంచిందని చెప్పారు. గోదావరి మీద కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టారని వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆచితూచి మాట్లాడు మిస్టర్ రేవంత్ రెడ్డి’ అని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని.. ఎల్‌ఎల్‌బీసీ కూలి ఇన్ని రోజులు అవుతున్నా ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎస్ఎల్బీసీ కుప్పకూలిందని.. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ రాజీనామా చేయాలని, సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.






