- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీష్ రావు సంచలన ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లో 'ఫ్యూచర్ సిటీ', 'ఫార్మా సిటీ' ప్రాజెక్టుల చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో 'ఫ్యూచర్ సిటీ', 'ఫార్మా సిటీ' ప్రాజెక్టుల చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీశ్ రావు అక్కడ మీడియాతో మాట్లాడాతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 'ఫ్యూచర్ సిటీ'ని రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే గతంలో ఉన్న 'ఫార్మా సిటీ' ప్రాజెక్టును మళ్లీ రీస్టోర్ (పునరుద్ధరిస్తాం) చేస్తాం. ఫార్మా సిటీ గనుక వస్తే లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కానీ, ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే ఆ పేరు ఎక్కడ బీఆర్ఎస్‌కు వస్తుందోననే ఈర్ష్యతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. ఎవరేం చేసినా, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఫార్మా సిటీనే వస్తుందని రాసి పెట్టుకోండి" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అది ఫార్మా కాదు.. ఫ్యూచర్ కాదు.. 'ఫార్మర్స్ సిటీ': రఘునందన్ రావు కౌంటర్
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావు ప్రకటనపై మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. అది ఫార్మా సిటీనో, ఫ్యూచర్ సిటీనో కాదని.. అసలైన 'ఫార్మర్స్ సిటీ' (రైతుల నగరం) అని ఆయన కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కేవలం ప్రాజెక్టుల పేర్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ.. "పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్. అక్కడ ఒక్క కంపెనీనైనా ఎందుకు పూర్తి చేయలేకపోయింది? ఆ ప్రాంతంలో పెట్టుబడులు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం గతంలో పర్యావరణ అనుమతులు ఇచ్చింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ ప్రాంతాన్ని మొదట 'ఫార్మర్స్ సిటీ'గా, ఆ తర్వాతే 'ఫార్మా సిటీ', 'ఫ్యూచర్ సిటీ'గా సమగ్రంగా తీర్చిదిద్దుతాం" అని స్పష్టం చేశారు. ఒకవైపు ఫార్మా సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద మార్చుతోందన్న ఆరోపణలు. మరోవైపు ఫ్యూచర్ సిటీ రద్దుపై బీఆర్ఎస్ హెచ్చరికలు, వీటన్నింటి నడుమ రైతుల పక్షాన బీజేపీ నిలబడతామనడంతో తెలంగాణలో ల్యాండ్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.






