మొత్తం 20 కుంభకోణాలు: హరీష్ రావు సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-29 15:34:02  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ చేశారు.

మొత్తం 20 కుంభకోణాలు: హరీష్ రావు సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘పొంగులేటి వ్యవహారం బయటపడిన తర్వాత తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతున్నదని, తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా లాగుతున్నారని విమర్శించారు. తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమని, అదే విధంగా సీఎం కుటుంబంపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరపాలి. నా తమ్ముని పేరు, నా బావమరిది పేరు తీశారు. విచారణ చేస్తాం అంటున్నారు. నేను రెడీగా ఉన్నాను. నీ తమ్ముడు టీడీఆర్‌లో చేసిన కుంభకోణంతోపాటు మా తమ్ముడిపై హౌజ్ కమిటీ వేయండి. సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధంగా ఉన్నాము. మీ తమ్ముడు, మీ బావమరిది మీద విచారణకు దమ్ముంటే మీరు రెడీగా ఉన్నారా?’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని రాష్ట్ర ప్రజలకు స్పష్టమైందని అన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సైతం పరోక్షంగా అంగీకరించారని పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా దాడి..

రాఘవ కన్స్ట్రక్షన్ అవినీతికి పాల్పడిందని స్వయంగా సీఎం చెప్పారని, అందుకే ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. అక్రమ మైనింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు తమకు మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం దళితుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు విషయాన్ని మళ్లించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతిని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం ఉపయోగించిన పదజాలం అభ్యంతరకరమని.. ఆ అంశాన్ని సైతం శాసనసభ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై నిజమైన ప్రేమ బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్నదని తెలిపారు. దళితబంధు వంటి పథకాల ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల కోసం కేవలం రూ.1,395 కోట్లు మాత్రమే కేటాయించిందని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి రూ.7,365 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి దళితులపై ప్రేమ మాటల్లో ఉంటే, బీఆర్ఎస్‌కు చేతల్లో ఉందని వ్యాఖ్యానించారు.

ల్యాండ్ సెటిల్‌మెంట్లలో సీఎం, మంత్రికి వాటా..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతిపై సీబీసీఐడీ విచారణ న్యాయంగా జరగదని హరీశ్‌రావు అన్నారు. మంత్రి పదవిలో ఉండగా విచారణ సజావుగా సాగదని, అందుకే వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే రూ.28 లక్షల జరిమానా విధించారని, అది కూడా చెల్లించలేదని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ఖజానాకు జరిగిందని పేర్కొన్నారు. మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి మీటర్లు అందుబాటులో లేవని చెప్పి డీజిల్ జనరేటర్ల వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు మైనింగ్ మంత్రి చెప్పారని, అయితే సీఎస్‌వో, సీఎఫ్‌వో అనుమతులు లేకుండా ఇది ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీంతో అక్రమ మైనింగ్ జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్‌పై తాము పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 కుంభకోణాలు జరిగాయని, వాటిపైనా విచారణ చేయాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చామని తెలిపారు.

నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు..

రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య భూ వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి సెటిల్‌మెంట్ల పేరుతో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ సెటిల్‌మెంట్లలో ఇద్దరికీ 50-50 వాటా నడుస్తున్నదని ఆరోపించారు. కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్, మూసీ సుందరీకరణ టెండర్ వంటి ప్రాజెక్టులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంస్థలకే వెళ్తున్నాయని ఆరోపించారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ ప్రాజెక్టులో కూడా భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య సంబంధం ఫెవికాల్ బంధంలా ఉన్నదని విమర్శించారు. సీబీసీఐడీ ప్రభుత్వం జేబు సంస్థలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మరోసారి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో నాలుగున్నర గంటల పాటు మైక్ కోసం ఎదురుచూసినా అవకాశం ఇవ్వలేదని తెలిపారు. పొంగులేటిపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ధైర్యం లేదని విమర్శించారు. అలాగే.. సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి తమ కార్యాచరణను ప్రకటిస్తామని, తదుపరి చర్యలపై పార్టీ ప్రణాళిక సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు.

Next Story