నన్ను ఉరి తీయండి, లేదా సస్పెండ్ చేయండి: అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-28 14:28:10  IST  )

తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

నన్ను ఉరి తీయండి, లేదా సస్పెండ్ చేయండి: అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' అక్రమ మైనింగ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామం (సర్వే నంబర్ 62, 63)లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతోందని హరీష్ రావు ఆరోపించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోందని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "లైసెన్స్ లేకుండా అక్రమ మైనింగ్ చేస్తే ఏడాది జైలు శిక్ష పడాలని చట్టం చెబుతోంది. మరి ఇన్ని నోటీసులు ఇచ్చినా, మైనింగ్ శాఖ లేఖలు రాసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?" అని హరీష్ రావు ప్రశ్నించారు.

ఒకరికి ఒక న్యాయం.. మరొకరికి మరో న్యామా?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడి అరెస్టును ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేశారు. "మహిపాల్ రెడ్డి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. 20 ఏళ్లుగా మేమంతా కలిసి పనిచేశాం. చిన్న తప్పు జరిగిందని ఆయనను రాత్రికి రాత్రే అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారు. మరి పొంగులేటి సంస్థపై ఎందుకు చర్యలు లేవు? ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయమా?" అంటూ నిలదీశారు. అక్రమ మైనింగ్‌పై తాను ట్వీట్ చేస్తే.. మంత్రి పొంగులేటి తనను "మొరిగే కుక్కలు" అంటూ సంబోధించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. "నన్ను అంత మాట అన్నందుకే నేరుగా చెబుతున్నాను.. అది పొంగులేటి సంస్థే! అక్కడ కాంగ్రెస్ జెండాలు ఉన్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆయన మంత్రిగా ఉంటే విచారణ సరిగ్గా జరగదు. అందుకే వెంటనే రాజీనామా చేసి ఎంక్వైరీకి ఆదేశించాలి" అని డిమాండ్ చేశారు.

హరీష్ రావు సవాల్..

ఈ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. "నేను చెప్పేవి అబద్ధాలైతే నన్ను ఉరి తీయండి లేదా ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. ఒకవేళ నేను చెప్పేవి నిజాలైతే వెంటనే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మీద కఠిన చర్యలు తీసుకోండి." అని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామాలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది, ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

మంత్రి పొంగులేటికి ఆయన భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులెలా అవుతారు: హరీశ్ రావు

Next Story