- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పొంగులేటికి ఆయన భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులెలా అవుతారు: హరీశ్ రావు
మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మైనింగ్, ఇసుక తవ్వకాల అంశం ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ శాసనసభలో పట్టుబట్టడంతో రాఘవ కన్‌స్ట్రక్షన్ తో పాటు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ మంత్రి దూరపు బంధువుల సంస్థను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.
ఆ విషయం లోకమంతా తెలుసు:
అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డేనన్నారు.
సభలో దాటవేత ధోరణి:
అసెంబ్లీని సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా? అని మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం అన్నారు.






