- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు?: హరీష్ రావు ఫైర్
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో.. అద్దె బకాయిలు చెల్లించలేదని తాజాగా భవన యజమాని తరగతి గదులకు తాళం వేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో.. అద్దె బకాయిలు చెల్లించలేదని తాజాగా భవన యజమాని తరగతి గదులకు తాళం వేశారు. పాఠశాల గేట్లు సైతం మూసివేశారు. దీంతో చిన్నారులు పుస్తక సంచులతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక ట్వీట్ పెట్టారు.
రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు?
‘సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసిపిల్లలు.. ఈరోజు రోడ్డు మీద కూర్చుని 'వియ్ వాంట్ జస్టిస్' అని నినదిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యాశాఖ నిర్వహణ మరెవ్వరి వల్ల కాదని, అందుకే తన వద్దే పెట్టుకున్నానని పదే పదే చెప్పే రేవంత్ రెడ్డి ఈ సంఘటనను చూసి సిగ్గుపడాలి. వరుసగా విద్యాశాఖకు సంబంధించి జరగకూడని ఘోరాలు జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంకెప్పుడు స్పందిస్తారు? ఈ శాఖను నిర్వహించడం చేతకాకపోతే.. తప్పుకుని వేరే వారికి బాధ్యతలు అప్పగించాలి.
పిల్లలకు భోజనం పెట్టేందుకు చేతులు రావడం లేదా?
సుమారు రూ.100 కోట్లతో వీఐపీ గెస్ట్ హౌస్ పేరిట ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, రూ. 4.5 కోట్లతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి మూడో క్యాంప్ కార్యాలయం కట్టడానికి నిధులుంటాయి కానీ.. బడి పిల్లలు చదువుకునే పాఠశాలకు అద్దె కట్టడానికి మాత్రం డబ్బులు లేవా?. రూ.5000 కోట్లతో మూసీలో 'గాంధీ సరోవర్' కడతామంటూ గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. బడి అద్దె కట్టేందుకు, నాణ్యమైన భోజనం పెట్టేందుకు చేతులు రావడం లేదా?. వేల కోట్లు ఖర్చు చేసి పెట్టే విగ్రహాలకు సామాన్య ప్రజల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేయడం.. బడికి అద్దె కట్టక విద్యార్థులను రోడ్డున పడేయడం.. ఈ విధ్వంసక పాలన మీకే చెల్లుతుంది రేవంత్ రెడ్డి’ అని హరీష్ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.






