సిగాచి బాధితులకు పరిహారం ఏమైంది?.. రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

by Prasad Jukanti |

కార్మికులకు రావాల్సిన పీఎఫ్‍ను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

సిగాచి బాధితులకు పరిహారం ఏమైంది?.. రేవంత్‌ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి నాలుగు నెలలు అవుతున్నా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇప్పటి వరకు అందలేదని, ఈ పరిహారం తక్షణమే చెల్లించాలి లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఆయన బహిరంగ లేఖ (Harish Rao open letter) రాశారు. 54 మంది కార్మికులను పొట్టనపెట్టుకున్న నాటి దుర్ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతున్నదని ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులు నడి రోడ్డున పడి కన్నీరు మున్నీరవుతున్నారన్నారు. ఒకవైపు అయిన వారిని కోల్పోయి, మరోవైపు ప్రభుత్వ సాయం అందక గుండెలవిసేలా రోదిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు ప్రమాద స్థలానికి వచ్చి, మృతదేహాల సాక్షిగా మీరు ఇచ్చిన హామి ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం శోచనీయం అని మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. పరిహారం అందకుండానే పరిహారం అందించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలకే విలువ లేకుంటే ఇక ఆ బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.

పరిహారం పరిహాసంగా మార్చారు:

సిగాచి ప్రమాద (Sigachi accident) బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో మీరు, మీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. ప్రమాదం జరిగిన జూన్ 30న మీరు స్వయంగా వచ్చి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం (compensation) అందిస్తామని ఘనంగా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. కానీ మీరు ప్రకటించిన పరిహారాన్ని పరిహాసంగా మార్చారని నాలుగు నెలలు గడిచినా పరిహారం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందన్నారు. తక్షణమే కోటి పరిహారం చెల్లించాలి.. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. గడిచిన నాలుగు నెలల్లో బాధితుల చేతికి అందింది కేవలం రూ.26 లక్షలు మాత్రమే (కంపెనీ ఇచ్చిన రూ. 25 లక్షలు + ప్రభుత్వ తరపున ఇచ్చిన రూ.లక్ష). ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి ఇంకా రూ.74 లక్షలు బాకీ పడ్డారని ఇది మాట తప్పడం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా బాధితులకు రూ. 40 నుండి 50 లక్షలు అందించాం అని ప్రకటించడం అత్యంత శోచనీయం అన్నారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI), ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మీరు ఇప్పించే నష్టపరిహారంలో కలిపి లెక్కలు చెప్పడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. చికిత్స పొందుతూ చనిపోయిన వారి ఖర్చులను కూడా పరిహారంలో కలిపి చూపడం మీ అమానవీయ పాలనకు అద్దం పడుతోందని చావులో కూడా రాజకీయం చూసుకునే దుర్మార్గ సంస్కృతికి తెరతీశారని ఆరోపించారు. గాయపడ్డ కార్మికులు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటుంటే పట్టించుకునే నాథుడే లేడన్నారు.

డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేరా?:

ప్రమాదంలో కాలి బూడిదై, ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాల రోదనలు మీకు వినిపించడం లేదా? ఈ 8 మంది సిబ్బంది ప్రమాదం జరిగిన రోజు విధులకు హాజరైనట్టు సీసీ టీవీ ఫుటేజీలు, బయోమెట్రిక్ ఆధారాలు ఉన్నప్పటికీ వారికి కనీసం డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. 3 నెలల్లో సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పిన అధికారులు, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ లేక ఆ కుటుంబాలకు బీమా డబ్బులు రాక, పరిహారం అందక నరకం అనుభవిస్తున్నారు. నిబంధనల పేరు చెప్పి, ఆచూకి దొరకని వారిని మృతులుగా పరిగణించడానికి 7 ఏళ్లు వేచి చూడమనడం మానవత్వం అనిపించుకుంటుందా? అని నిలదీశారు.

హైకోర్టు నిలదీసినా చలనం లేదు:

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇప్పటికీ బాధితులకు అందలేదు. కేంద్రంతో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సాక్షాత్తు హైకోర్టు మీ ప్రభుత్వాన్ని నిలదీసినా మీలో చలనం లేదు. సిట్ (SIT) విచారణ జరిపించాలని డిమాండ్ ఉన్నా పట్టించుకోరు. దర్యాప్తు పేరిట కాలయాపన చేస్తూ, యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? అన్నారు.

వలస కార్మికుల మరణాలతో రాజకీయమా?:

ముఖ్యమంత్రిగా మీ హామీని నమ్మి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మిక కుటుంబాలు మూడు నెలలు ఇక్కడే పడిగాపులు కాశారు. పరిహారం ఇక రాదేమోనని నిరాశ చెంది, కన్నీళ్లతో తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. వలస కార్మికుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఎంతో గౌరవాన్ని చూపితే మీరు మాత్రం వలస కార్మికుల మరణాలను కూడా రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. పరిహారం మాట దేవుడెరుగు, చివరకు డెత్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఇక్కడే స్థానికంగా ఉన్న మన తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబాల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ, పరిశ్రమ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. తిరిగి తిరిగి వారి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప, పాలకుల మనసు కరగడం లేదన్నారు. న్యాయం చేయమని అడిగితే పరిశ్రమ వద్ద ఉన్న ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది వారిని ఆదరించాల్సింది పోయి ఈసడించుకుంటున్నారు. 'మా చేతుల్లో ఏమీ లేదు.. అంతా యాజమాన్యం దయ.. వాళ్లు చెబితేనే మేం చేస్తాం.. మాకు ఎలాంటి సమాచారం లేదు' అంటూ కసురుకుంటున్నారన్నారు. అయిన వారిని కోల్పోయిన ఆవేదనలో ఉన్న వారిని ఓదార్చాల్సింది పోయి, విసుక్కుంటూ చీదరించుకోవడం దుర్మార్గం అన్నారు.

ఆ కుటుంబాల ఉసురు తగలక మానదు:

ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే మీకు 54 కుటుంబాల కన్నీటి వేదన మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వమే వారిని మరింత దుఃఖంలోకి నెట్టివేయడం అత్యంత అమానవీయం అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మీరు హడావిడిగా వచ్చి చూపించిన సానుభూతి కేవలం ప్రచారం కోసమేనా? బాధితుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వమే, నేడు యాజమాన్యానికి కొమ్ముకాస్తూ పారిశ్రామికవేత్తల చేతుల్లో కీలు బొమ్మలా మారడం తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టండి, మొద్రు నిద్ర వీడండి ఇచ్చిన హామీ ప్రకారం పరిహారం అందించి సిగాచి బాధితుల కన్నీళ్లు తుడవండి. లేదంటే ఆ కుటుంబాల ఉసురు మీకు, మీ ప్రభుత్వానికి తగలకమానదన్నారు.

Next Story