- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో (Telangana PG medical admissions) మేనేజ్‍మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఈ విషయంలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉంటే వీటిలో 50 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తున్నాయని మిగిలిన 50 శాతం రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) మేనేజ్‍మెంట్ కోటాగా కింద ఉన్నాయన్నారు. ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్ళిపోతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చిన ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వక పోవడం శోచనీయం అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ధ్వజమెత్తారు.
ఏపీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ – తెలంగాణలో శూన్యం!
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకే రిజర్వేషన్లు కల్పిస్తూ, కేవలం 15 శాతం సీట్లు మాత్రమే నాన్-లోకల్ విద్యార్థులకు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ విధానంతో ఆ రాష్ట్ర విద్యార్థులకు పీజీ సీట్లలో పెద్ద ఎత్తున లాభం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మన రాష్ట్ర విద్యార్థుల అవకాశాలను ఇతర రాష్ట్రాల విద్యార్థులు కొల్లగొడుతున్నారు. దీని వల్ల 450 పీజీ సీట్లు మొత్తం ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ విద్యార్థులు 382 సీట్లు కోల్పోతున్నారని రాసుకొచ్చారు. ఏపీ తరహాలో రిజర్వేషన్ కల్పిస్తే, ఈ 450 సీట్లలో 68 సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగిలిన 382 సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తాయి. కానీ ఈ రిజర్వేషన్ లేకుండా ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తే 382 పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులు శాశ్వతంగా కోల్పోవాల్సి ఉంటుందన్నారు.
మొద్దు నిద్ర వీడండి:
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యలో అవకాశాలు పెంచడానికి జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలను ప్రారంభించారని హరీశ్ రావు గుర్తు చేశారు. స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అడ్మిషన్ రూల్స్‌లో సవరణలు చేసి, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 520 ఎంబీబీఎస్ సీట్లు దక్కాయని పేర్కొన్నారు. బి కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్ వల్ల 1300 సీట్లు ప్రతి సంవత్సరం అదనంగా లభించాయన్నారు. మొత్తంగా 1,820 అదనపు ఎంబీబీఎస్ సీట్లు ప్రతి ఏటా తెలంగాణ విద్యార్థులకు లభించాయని గుర్తు చేశారు. తెలంగాణ వైద్య విద్యార్థులకు జరుగుతున్న నష్టం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర విడి మేనేజ్‍మెంట్ కోటా సీట్లలో 85 శాతం స్థానిక రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని, ప్రస్తుతం విడుదల చేసిన పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలని, కొత్త జీవో జారీ చేసి, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేలా స్పష్టమైన విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు.






