‘మనమేంటో చూపించాల్సిన సమయం’.. జూబ్లీహిల్స్ బై పోల్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు

‘మనమేంటో చూపించాల్సిన సమయం’.. జూబ్లీహిల్స్ బై పోల్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ మైనారిటీ విభాగం సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు(Harish Rao), తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుసేన్, సలీం, బీఆర్‌ఎస్ మైనారిటీ నేత సొహయిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ సమాజం మొత్తం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తుచేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు.

కేసీఆర్(KCR) ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారు. షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందించారు. అంతేకాదు దేశంలో మొదటిసారి ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనమిచ్చారు. రంజాన్ తోఫా ఇచ్చి ముస్లిం సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. కాంగ్రెస్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. మైనార్టీ సబ్ ప్లాన్ ఇస్తాం. నాలుగు వేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ కేటాయిస్తాం. ఇమామ్, మౌజన్లకు రూ. 5,000 నుండి రూ.12 వేలకు పెంచుతామన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసిఆర్ రూ. 20 లక్షలు ఇస్తే మేము రూ. 25 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని తీవ్రంగా మండిపడ్డారు. ఇందులో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువచ్చి వారితో మాట ఇప్పించాడు. ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్తా లేరు. ఒక లక్ష 12 వేల మంది పేద మైనార్టీ ఆడబిడ్డలకు షాదీ ముబారక్ కేసీఆర్ అందించారు. కాంగ్రెస్ తులం బంగారం ఇస్తామని మోసం చేసి షాదీ ముబారక్ కూడా ఇవ్వడం లేదు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేసినంత దేశంలో మరి ఏ నాయకుడు చేయలేదు. అంతేగాకుండా.. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడే మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారని అన్నారు.

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌(Jubilee Hills by-election)లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలి. హైడ్రా, మూసీ పేర్లతో ముస్లిం సోదరుల ఇళ్లను కూల్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కూల్చిన ఇండ్లకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్లను ఇవ్వలేదు కానీ ఉన్న ఇళ్లను కూలగొట్టాడు. అందరం కలిసి పనిచేసి జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని కోరుతున్నాను అని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

Next Story