- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: నీరుగారుతున్న విదేశీ విద్యా పథకం.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశీ విద్యా (foreign education) పథకం కింద ఎంపికైన, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. విద్యార్థులకు శాపంగా మారుతోందని తెలిపారు. ఇదే విషయమై డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్ షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క (Minister Seethakka) సమాధానం చెప్పారని గుర్తుకు చేశారు.
ఈ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావస్తోందని, ఇప్పటి వరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవన్నారు. (CM Revanth Reddy) రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడం పై లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదని, ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయిందని స్పష్టం చేశారు. కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విదేశీ విద్యకు వెళ్లగా, మరికొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పథకంలో ఎంపిక అవుతామేమో అనే ఆశతో ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, విదేశీ విద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






