స్థానిక ఎన్నికల ఎఫెక్ట్: తెలంగాణ ప్రజలకు హరీష్ రావు కీలక పిలుపు

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రజలకు హరీష్ రావు కీలక పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల ఎఫెక్ట్: తెలంగాణ ప్రజలకు హరీష్ రావు కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల వివరాలను ప్రజలకు వివరించేలా రూపొందించిన బాకీ కార్డులను తెలంగాణ భవన్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘అభయహస్తం అన్నరు, బాండ్ పేపర్లు పంచారు. ఇది అభయహస్తం కాదు, అచేతన హస్తం అని ప్రజలకు అర్థం అయ్యింది. ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లోనే అమలు చేస్తాం, అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తాం అన్నారు. స్వయంగా రాహుల్, ప్రియాంక గాంధీలతో హామీలు గుప్పించారు. చివరకు అమలు చేయడం చేతగాక చేతులు ఎత్తేశారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని రాహుల్, ప్రియాంక తెలంగాణకు రావడమే మానేశారు. రేవంత్ ఇచ్చిన హామీలను గంగలో కలిపారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు పది రోజులు అసెంబ్లీ పెట్టాలంటే ఒక్కరోజు కాళేశ్వరం మీద పెట్టి పారిపోయారు. రాష్ట్రంలో కొత్తగా రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదు. ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు’ అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇండ్ల ముందుకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు హరీష్ రావు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5డీఏలు పెండింగ్, పీఆర్సీ ఊసే లేదు, ఆటో కార్మికులకు రూ.12 వేలు ఇవ్వడం లేదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లు అందరూ మోస పోయారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం మా బాధ్యత, కాంగ్రెస్ మెడలు వంచుతాం.. అందుకే బాకీ కార్డు ఉద్యమం మొదలెట్టామని హరీష్ రావు వెల్లడించారు. ఈ బాకీ కార్డులను ప్రతీ ఇంటికీ పంచుతాం.. కాంగ్రెస్ మోసాన్ని వివరిస్తాం. బాకీ కార్డులను విడుదల చేసే కార్యక్రమం చేపట్టిన కేటీఆర్‌కి అభినందనలు అని హరీష్ రావు పేర్కొన్నారు.

Next Story