- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: పెండింగ్‍లో డీఏలు.. రాష్ట్ర ఉద్యోగులకు హరీశ్ రావు కీలక విజ్ఞప్తి
దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెబితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ చేదు ఫలితాలు చెప్పిందని హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‍లో ఉన్న ఐదు డీఏలను (Pending DA) విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 3 శాతం డీఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏను తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు ఐదు డీఏలు పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు. ఇవాళ సిద్దిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కమిషన్లకు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చేయి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభయహస్తం కాదని బస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 73 శాతం గరిష్ట పీఆర్సీ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డిఏలు, ఐదు సరెండర్ లీవులు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని 5500 కోట్ల కాంట్రిబ్యూషన్ పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని ఈ అన్యాయానికి, అహంకారానికి, అరాచకాలను ఎక్కువ రోజులు సహించరన్నారు.
ప్రశ్నిస్తే బెదిరిస్తారా?:
ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘ నాయకులపై అక్రమ కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గం అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని హరీశ్ రావు విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‍లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగుల అలవెన్స్లు, ఏరియస్ పెండింగ్‍లో ఉన్న వాటిని విడుదల చేయాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీంని పునరుద్దరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన రూ.5500 కోట్లను తక్షణమే తిరిగి సీపీఎస్ కాంట్రిబ్యూషన్‍కు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చిరు ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ హామీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డును అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు విజ్ఞప్తి:
రేవంత్ రెడ్డి బెదిరింపులకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని హరీశ్ రావు అన్నారు. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర గొప్పదని చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగులు మీ పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉండి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పారు.
దక్షిణ రైతులంటే బీజేపీకి ఎందుకింత చిన్నచూపు?
క్వింటాల్ గోధుమలకు 160 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం వరికి మాత్రం 69 రూపాయలు పెంచడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారత దేశ రైతులకు ఒక నీతి దక్షిణ భారతదేశ రైతులకు ఒక నీతా అని ప్రశ్నించారు. ఎందుకు దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీకి చిన్న చూపు అని నిలదీశారు. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలారా.. రైతుల పక్షాన నిలబడతారా? కేంద్రానికి కొమ్ము కాస్తారా? అని నిలదీశారు. తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరికి మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు.






