- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రులతో రాజకీయాలొద్దు .. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
వందేళ్ల ముందు చూపు కేసీఆర్ ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వందేళ్ల ముందు చూపు కేసీఆర్ ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. చేతగాని తనం వల్ల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీమ్స్ ఆసుపత్రులను (TIMS Hospital) రెండేళ్లుగా పడావు పెట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన పార్టీ నేతలతో కలిసి హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ లను పూర్తి చేసి వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణం అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని మండిపడ్డారు. డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప పనులు పూర్తి కావడం లేదని.. బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలను రద్దు చేయడం దుర్మార్గం అన్నారు. బస్తీ దవాఖానలకు సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఒకటో తేదీనే జీతాలు అన్న రేవంత్ రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదని ప్రశ్నించారు. రూ. 1400 ఆరోగ్య శ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.
బీఆర్ఎస్ పాలనలో పురోగమనం కనిపిస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం కనిపిస్తోందన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రీషన్ కిట్ బందు, పెట్టారని రేవంత్ రెడ్డికి తిట్ల మీద ఉన్న ప్రేమ, కిట్ల మీద లేదని ఎద్దేవా చేశారు. రేవంతు పాలనలో రాష్ట్రం వెనక్కిపోతున్నదని జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెబుతావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం రూ.1400 కోట్ల బకాయిలు పడిందని వీటిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలను ఆపడం తప్ప, మీరు చేస్తున్నదేం లేదున్నారు. ఇప్పటికైనా మీ మంద బుద్ధి మార్చుకుని పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆపాలన్నారు.






