రెండేళ్లయినా అవగాహన రావడం లేదు: హరీష్ రావు

by Gantepaka Srikanth |

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలు మాట్లాడవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం బీర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

రెండేళ్లయినా అవగాహన రావడం లేదు: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త మాటలు మాట్లాడవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం బీర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో ఏడు డీపీఆర్‌లకు అనుమతులు తీసుకొస్తే.. కాంగ్రెస్ హయాంలో మూడు డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క డీపీఆర్‌ను సైతం కేంద్రానికి పంపలేదు, ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. నీళ్ల మంత్రికి రేవంత్‌రెడ్డి సహవాస దోషం పట్టినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ బయటపెట్టిన బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోలోనే 90 టీఎంసీలు అని స్పష్టంగా ఉన్నదని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డిని 45 టీఎంసీలకు తగ్గించారా.. లేదా? సమాధానం చెప్పాలని నిలదీశారు. డీపీఆర్ వెనక్కి వచ్చి ఏడాది అయినా ఎందుకు పట్టించుకోలేదని.. ఇవాళ్టికీ మళ్లీ ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నారని.. వీరంతా పాలమూరు ద్రోహులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రాజెక్టు పనులు ఆగకూడదని తాగునీటి పనుల పేరిట పనులు కొనసాగించామని స్పష్టం చేశారు. 90 టీఎంసీలకు డీపీఆర్ ఇచ్చి ఏడు అనుమతులు సైతం తెచ్చామన్నారు. పాలమూరు జిల్లాలో రూ.4,000 కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు.

రెండు టీఎంసీలపై చర్చకు సిద్ధం

రెండు టీఎంసీల కోసం రెండు టన్నెల్స్ తామే తవ్వామని.. పనులు చేశామని.. ఈ విషయంలో వెళ్లి చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు ఉత్తమ్‌కు సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలు కేసు వేస్తే తాము స్టే ఎత్తివేయించి అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు. రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి 27 వేల ఎకరాల భూమి సేకరించామన్నారు. అలాగే.. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలకు రెండేళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టారని.. డీపీఆర్ ఇప్పటికీ పంపలేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ 60 ఏళ్లలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తే.. తొమ్మిదిన్నరేళ్లలో ఆరున్నర లక్షల ఎకరాలకు పైగా నీరు ఇచ్చామని చెప్పారు. కల్వకుర్తిపై రూ.2,300 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. రెండేళ్లయినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇంకా అవగాహన కూడా రావడం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం బీఆర్ఎస్ హయాంలో 11 కిలోమీటర్లకు పైగా తవ్వితే.. రెండేళ్లలో కాంగ్రెస్ 200 మీటర్లు మాత్రమే తవ్విందన్నారు. రెండేళ్లలో కిలోమీటర్ పొడవు ఉంటే లింక్ కెనాల్‌ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.

సభను 15 రోజులు నిర్వహించాలి

సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఏసీలో పట్టు పట్టామని హరీశ్‌రావు తెలిపారు. వారం‌ రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని..‌ వారం తర్వాత మళ్లీ బీఏసీ పిలుస్తామన్నారని చెప్పారు. నదీ జాలలపై సభలో బీఆర్ఎస్‌కు సైతం పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తినట్లు తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక క్వశ్చన్ అవర్ 6 రోజులు మాత్రమే పెట్టారని.. ప్రతిరోజూ పెట్టాలని కోరినట్లు వెల్లడించారు. అలాగే.. ఖాళీగా ఉన్న 16హౌస్ కమిటీలు వేయాలని కోరామన్నారు. ఎజెండా పంపే పద్ధతి సరిగా లేదు.. 24 గంటల ముందే ఎజెండా ఇవ్వాలని కోరామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ అని బోర్డులు పెట్టారు కానీ, అసెంబ్లీ పని దినాలు ఫాలింగ్ అని విమర్శించారు. 15 అంశాలపై సభలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, గ్యారంటీలు, ఫార్మా సిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ధారాదత్తం, కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెచ్చిన పాలసీలో జరిగిన అవినీతి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ తప్పిదాలు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం, 45 టీఎంసీలు చాలని కేంద్రానికి లేఖ రాయడం, హిల్ట్ పాలసీతో ఐదు లక్షల కోట్ల కుంభకోణం, గురుకులాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం, గ్రేటర్ హైదరాబాద్‌లో 22 మున్సిపాలిటీల విలీనం, హైడ్రా విపరీత పోకడలు, ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుతో రైతులకు జరుగుతున్న ఇబ్బందులు, రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు, ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లింపును పెండింగ్‌లో పెట్టడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలపై చర్చించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

Next Story