- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్‌లో 36 లక్షల మంది చూశారు.. మరి రేవంత్ ప్రసంగాన్ని: హరీశ్ రావు సెటైర్
తమ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని.. అందులో దాచిపెట్టేదేం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తమ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లామని.. అందులో దాచిపెట్టేదేం లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాత్రం తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడారని.. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారని అన్నారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏ విధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని.. అలాగే మే 6న హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్లామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫామ్‌పై గెలిచి తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఒక ఎమ్మెల్యే అనడం, దాన్ని స్పీకర్ ధ్రువీకరించడం అత్యంత దుర్మార్గమన్నారు. అలాగే.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉన్నదని.. పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి అని.. ఈరోజు హోంమంత్రిగా ఆయనే ఉండడంతో కంప్లైంట్ కూడా ఆయనేనని తెలిపారు. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి, వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారని వెల్లడించారు. నాడు సమైక్యవాదులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్‌రెడ్డికి ఆ స్టే వెకేట్ అయితే సీటు ఊడటం, జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.
కేసీఆర్‌కు భయపడి రైతు భరోసా..
కేసీఆర్ స్టేట్స్ మన్‌లాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడితే.. రేవంత్‌రెడ్డి తన కుర్చీ కోసం స్ట్రీట్ మన్‌లాగా మాట్లాడారని హరీశ్‌రావు అన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. కేసీఆర్ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకుని రేవంత్ తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారన్నారు. కేసీఆర్ వస్తున్నారని భయపడి డైవర్షన్ కోసం ఒక కిస్తీ రైతు భరోసా వేశారని.. ఆయన గర్జించకపోతే ఆ డబ్బులు కూడా పడేవి కావన్నారు. కేసీఆర్ స్పీచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూసి అదే సమయానికి మైకు పట్టుకోవడం సీఎం స్థాయికి తగదన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్‌లో 36 లక్షల మంది చూస్తే, రేవంత్ ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారన్నారు. కేసీఆర్ వ్యూవర్ షిప్‌లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ లైవ్‌లో బీఆర్ఎస్ సభను 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్‌లో కేవలం 54 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కేసీఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయని అన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన సీఎంగా కేసీఆర్ ఎంతో హుందాగా రేవంత్‌రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే.. రేవంత్‌రెడ్డి మాత్రం రంకెలు వేయడం, ఏడవడం తప్ప ఇంకేం చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పిన మాటలు విని తప్పులు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి.. ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకున్నారని అన్నారు. రేవంత్ ఎన్ని డ్రామాలు ఆడినా సీఎంగా ఆయనకు నూకలు చెల్లాయని.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అన్నారు.






