Harish Rao: అసమర్థతను మరోసారి చాటుకున్న రేవంత్

by Gantepaka Srikanth |

సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి చాటుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

Harish Rao: అసమర్థతను మరోసారి చాటుకున్న రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి చాటుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ.. మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని.. కానీ, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. మాట ఇచ్చి తప్పడం సీఎంకు అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు.

యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని.. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం 54 మంది బాధితులకు ఇప్పటివరకు చెల్లించిన రూ.24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం రూ.45.40 లక్షలు మాత్రమేనని ఆరోపించారు. ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.54.60 లక్షల చొప్పున, మొత్తంగా రూ.29.48 కోట్ల బకాయి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని తెలిపారు. యాజమాన్యం తాము రూ.40 నుంచి రూ.42 లక్షలు ఇస్తున్నామని కోర్టుల ముందు ఒప్పుకున్నదని.. వారు సొంతంగా ఇచ్చిన 25 లక్షలకు.. కార్మికులు చనిపోవడం వల్ల చట్టబద్ధంగా వారికి రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా కలుపుకుని ఈ లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బును పరిహారంలో కలిపి చూపించడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడుతనానికి పరాకాష్ట అని తెలిపారు. ఈ నీచమైన కుట్రలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.

Next Story