- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: అది నా బాధ్యత.. నిర్వర్తించి తీరుతా
సభలో అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. స్పీకర్ తీరుకు, ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సభలో అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిన స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. స్పీకర్ తీరుకు, ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. సభలో స్పీకర్ ఏకపక్ష వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక, అసభ్యకర ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని.. బీఏసీ సమావేశానికి తమను గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారని తెలిపారు. ఈ సమావేశంలో సభను ఏడు రోజులపాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నామని.. కానీ, సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నామని తప్పుడు సమాచారం పొందుపరిచారని ఆరోపించారు. స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని.. క్వశ్చన్ అవర్‌లో 10 ప్రశ్నలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తమ మైక్ కట్ చేశారని అన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించలేదా? మరి ఇక్కడ తాము సీఎంను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎంను విమర్శించొద్దని స్పీకర్ రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి అని.. ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు? తమను పిలవడం ఎందుకు? అని నిలదీశారు.
వీధి రౌడీలా సీఎం వ్యవహారం..
మూసీ నది కంపు కంటే సీఎం రేవంత్‌రెడ్డి మాటల కంపు ఎక్కువైపోయిందని.. మూసీ ప్రక్షాళన కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారని.. ఒక సీఎంలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని సీఎల్పీ మీటింగ్‌లా, గాంధీ భవన్‌లా మార్చేశారని ఆరోపించారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్లే సొల్లు వాగుడు వాగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్‌ను పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడారని.. కేసీఆర్‌పై సీఎం వాడిన భాషను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్‌రెడ్డినే అసలైన తెలంగాణ ద్రోహి, తెలంగాణ నీటి ద్రోహి అని అన్నారు. మూసీపై చర్చకు తాము సిద్ధమని.. షార్ట్ డిస్కషన్ పెట్టి రోజంతా చర్చిద్దామని సవాల్ విసిరారు. క్వశ్చన్ అవర్‌లో సీఎం వచ్చి గంటన్నర సేపు అడ్డగోలుగా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలను మల్లన్నసాగర్ నుంచి తెస్తున్నారా అని అడిగితే దానికి సమాధానం ఇవ్వలేదన్నారు. మూసీలో ఇళ్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరామని.. వీటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. మూసీ శుద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 32 ఎస్టీపీలను కట్టిందని.. మరో 39 ఎస్టీపీల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని.. అది తమ చిత్తశుద్ధి అని చెప్పారు. రాహుల్‌గాంధీ దేశంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.






