- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భూ భారతి.. భూ హారతిగా మారిందా?: హరీష్ రావు
‘భూ భారతి.. భూ హారతిగా మారిందా? కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా?’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ‘భూ భారతి.. భూ హారతిగా మారిందా? కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా?’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ప్రభుత్వ తీరు ఉన్నదని.. మీరు తెచ్చిన రెవెన్యూ సంస్కరణలు చెత్త సంస్కరణలని పేర్కొన్నారు. భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న వరుస ఘటనల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో అన్నదమ్ములు ఆందోళనకు దిగారని.. నిన్న భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదని.. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసీల్దార్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ధరణిపై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన భూ భారతి భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైందని నిలదీశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదని.. కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని ప్రశ్నించారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇదని.. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని విమర్శించారు. ‘ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది?’ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేల్కొని, పెండింగ్‌లో ఉన్న భూ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలని డిమాండ్ చేశారు.






