బనకచర్ల కుట్ర బయటపడింది.. సీఎం రేవంత్‌కు హరీష్‌ రావు కౌంటర్

by Gantepaka Srikanth |

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల అసలు బాగోతం ఢిల్లీలో రేవంత్ మాటల ద్వారా బయటపడ్డదని ఆరోపించారు.

బనకచర్ల కుట్ర బయటపడింది.. సీఎం రేవంత్‌కు హరీష్‌ రావు కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల అసలు బాగోతం ఢిల్లీలో రేవంత్ మాటల ద్వారా బయటపడ్డదని ఆరోపించారు. బనకచర్లపై చంద్రబాబునాయుడుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరిలో 1,000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే చాలనే పల్లవిని వినిపించారని పేర్కొన్నారు. తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయని ఆరోపించారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు, చంద్రబాబుతో చర్చల ప్రతిపాదన ముందే కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని పేర్కొన్నారు. కేసీఆర్ గోదావరిలో తెలంగాణకు ఇప్పటికే ఇచ్చిన జీవోల ఆధారంగా 968 టీఎంసీల హక్కుతోపాటు సముద్రంలో కలుస్తున్న 3,000 టీఎంసీలలో 1,950 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

మొత్తం 2,918 టీఎంసీలు కేసీఆర్ అడిగితే రేవంత్‌రెడ్డి వెయ్యి టీఎంసీలకు మన వాటా పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో 763 టీఎంసీల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు బీఆర్ఎస్ పోరాడితే రేవంత్‌రెడ్డి 500 టీఎంసీలతో సరిపెట్టాలనుకోవడం రాష్ట్రాన్ని నిండా ముంచడమే అని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌కు డిమాండ్ చేయకపోవడం, చంద్రబాబుతో చర్చలు చేపడుతామనడం వెనక మతలబు ఏమిటో అర్థం అవుతున్నదని ఆరోపించారు. ఇది చంద్రబాబుకు గురుదక్షిణగా భావించాలా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు రేవంత్‌రెడ్డి అదే పనిగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.

Next Story