హిందూ, ముస్లిం అందరూ కలిసి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి.. హరీశ్‌రావు

by Ramesh Naini |   (  Updated:2025-10-13 13:05:15  IST  )

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల మీదకి బుల్డోజర్లు వస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందూ, ముస్లిం అందరూ కలిసి హైదరాబాద్‌ను కాపాడుకోవాలి.. హరీశ్‌రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ గెలిస్తే మీ ఇండ్ల మీదకి బుల్డోజర్లు (bulldozers) వస్తాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా బంద్ కావాలంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, లేదంటే నేను ఇండ్లు కూలగొట్టినా నన్నే గెలిపించారు అని ఇంకా ఇండ్లు కులగొడుతాడని ఆరోపించారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. బాండ్ పేపర్లు రాసి ఇచ్చారు.. వంద రోజులు కాదు, 7 వందల రోజులు దాటినా అమలు చేయడం లేదన్నారు. అందుకే వారికి ఎన్నికల్లో సురుకు తగలాలని ప్రజలు కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ చిత్తు చిత్తుగా ఓడితే కనువిప్పు కలుగుతుందని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, లేకుంటే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టినా, హామీలు అమలు చేయకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటు వేశారు అని అంటారు.. అని విమర్శలు గుప్పించారు.

ఉద్యోగాలు రావాలన్నా, పింఛన్లు రావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా, హైడ్రా ఆగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, మాగంటి సునీతా గెలవాలన్నారు. ఇది ఆమె గెలుపు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాని అక్కా చెల్లెల్ల గెలుపు, పింఛన్లు రాని అవ్వాతాతల గెలుపు, నిరుద్యోగుల గెలుపు.. అని చెప్పారు. రేవంత్ ఓడినా ఆయన సీఎం పదవి పోదు, ప్రభుత్వం పోదు.. కానీ వారికి అర్థం కావాలి.. అని ప్రజలకు సూచించారు. హిందూ, ముస్లిం అందరూ కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story