మీతో కలిసి రావడానికి మేము సిద్ధం.. కాంగ్రెస్‌తో నేతలకు హరీష్ రావు సూచన

by Gantepaka Srikanth |

కృష్ణా జలాల్లో జలదోపిడీ జరిగినట్లు, గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ చేస్తున్నదని.. అయినా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.

మీతో కలిసి రావడానికి మేము సిద్ధం.. కాంగ్రెస్‌తో నేతలకు హరీష్ రావు సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల్లో జలదోపిడీ జరిగినట్లు, గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ చేస్తున్నదని.. అయినా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడీ-కాంగ్రెస్ మౌనం’పై మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కేటీఆర్ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంలోనే బిజీగా ఉన్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్‌పై ఈ ప్రభుత్వానికి దృష్టి లేదని పేర్కొన్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మౌనం వెనుక ఉన్న కారణం ఏంటని ప్రశ్నించారు. గోదావరి-బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడడం లేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

నిధులు.. నదుల నీళ్లు రెండూ ఆంధ్రాకే..

నిధులు, నదుల నీళ్లు రెండూ ఆంధ్రాకే అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని హరీశ్‌ రావు ఆరోపించారు. తెలంగాణకు మాత్రం గుండు సున్నా అని అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో అన్యాయం జరుగుతున్నా ఎందుకు సైలెంట్ అయ్యారని అన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి నోరు మెదపడం లేదన్నారు. రెండు టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారని.. మరి నేడు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలని అన్నారు. అయినా.. రేవంత్‌ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టును నియంత్రించాల్సిన కేంద్రం నిధులు సమకూర్చుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. ఒప్పందానికి మించి ఏపీ కృష్ణా నీటిని తీసుకుపోతున్నా ఎందుకు స్పందించరని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ తదితర అనుమతులు లేకున్నా ప్రాజెక్టు నిర్మించేందుకు ఏపీ సిద్ధపడిందని.. అంతేకాకుండా ఈ నెలాఖరులోనే టెండర్లు పిలిచేందుకు ఏపీ రెడీ అయిపోయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా.. గోదావరిలో వృథాగా పోతున్న 200 టీఎంసీల వినియోగానికి బనకచర్ల నిర్మిస్తున్నామని చంద్రబాబు చెబుతున్నా.. 400 టీఎంసీల తరలించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఆ మేరకు కెపాసిటితో సొరంగాలు, కెనాల్స్ తవ్విస్తున్నట్లు స్వయంగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన ఫిజిబులిటీ రిపోర్టులో పేర్కొందని తెలిపారు.

దోస్తానా కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు

‘చంద్రబాబుతో మీకు ఉన్న దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా రేవంత్? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకు ఇచ్చామని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పారని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న పరపతితో చంద్రబాబు నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నారని అన్నారు. అయినా.. రేవంత్‌రెడ్డి, మంత్రుల్లో కదలిక లేదన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకావాలని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ మంతులు నాడు సమైక్య రాష్ట్రంలో బానిసల్లాగా బతికారని.. నేడు రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారని అన్నారు. గోదావరి నదిలో బీజేపీ, ఏపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం తలపెడితే కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నదని ఆరోపించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుందని.. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడడం లేదని నిలదీశారు.

మీరు పోరాడుతామంటే కలిసొస్తాం

బనకచర్లను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పోరాటానికి సిద్ధమైనా వారితో బీఆర్ఎస్ పార్టీ కలిసొస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే కూడా సహకరిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. వెంటనే అఖిలపక్షం మీటింగ్ పెట్టాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుపై చర్చకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టాలన్నారు. తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతామంటే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికైనా రేవంత్ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టాలని అన్నారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు సైతం మౌనం వీడి చంద్రబాబు జలదోపిడీని అడ్డుకకొని తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

అపెక్స్ మీటింగ్‌కు డిమాండ్ చేయండి

బనకచర్లపై తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినందుకైనా జల శక్తిమంత్రికి శుక్రవారం రాసినట్లు శనివారం లేఖ విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ప్రెస్‌‌మీట్ పెట్టిన సందర్భంలోనూ ముందు డేట్ వేసి, మీడియాకు లేఖ విడుదల చేశారని ఆరోపించారు. లేఖలు రాసి మీడియాకు ఇవ్వడం కాదని.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రిని బనకచర్ల విషయంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు డిమాండ్ చేయాలని సూచించారు.

Next Story