వాళ్లంతా గాంధీ భవన్‌కు పోటెత్తకముందే కళ్ళు తెరవండి.. CM రేవంత్‌కు హరీష్ రావు సూచన

by Gantepaka Srikanth |

‘సన్నాలకు బోనస్ బంద్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్. గ్యాస్ బండకు రాయితీ బంద్. రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్.

వాళ్లంతా గాంధీ భవన్‌కు పోటెత్తకముందే కళ్ళు తెరవండి.. CM రేవంత్‌కు హరీష్ రావు సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సన్నాలకు బోనస్ బంద్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్. గ్యాస్ బండకు రాయితీ బంద్. రాజీవ్ యువ వికాసం అమలు కాకముందే బంద్. బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్’లో విమర్శించారు. ‘ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల?’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారని.. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలు గాలికి వదిలేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని పేర్కొన్నారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదని సూచించారు. రేవంత్ మాటలు వినివిని విసిగిపోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్‌కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియజేశారని పేర్కొన్నారు. మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్‌కు పోటెత్తకముందే కళ్ళు తెరవాలని సూచించారు. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

మేడిగడ్డకు ఓ నీతి.. సుంకిశాలకు ఇంకో నీతా?

మేడిగడ్డకు చిన్న రిపేర్ చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బీఆర్ఎస్‌ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. సుంకిశాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డకు ఒక నీతి.. సుంకిశాలకు మరో నీతా? అని ప్రశ్నించారు. సుంకిశాల మీద ఎక్స్‌పర్ట్ కమిటీ ఎంక్వయిరీ ఉండదని.. విజిలెన్స్ కమిషన్ విచారణా ఉండదని.. జ్యుడీషియల్ కమిషన్ ఉండదని.. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఉండదని పేర్కొన్నారు. ఇవేమీ లేకుండానే సైలెంట్‌గా రిపేర్ చేయిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలు సైతం పక్కకు పెట్టడం, కాంగ్రెస్ మార్కు ప్రజా వ్యతిరేక-ప్రతిపక్ష వేధింపు పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

Next Story