ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. కానీ: హరీష్ రావు

by Gantepaka Srikanth |

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. కానీ: హరీష్ రావు

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా.. కానీ: హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రాష్ట్రం తెచ్చిన వాళ్లం.. మాది త్యాగాల చరిత్ర. రేవంత్‌రెడ్డి.. నీ అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని.. అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తారట అని తెలిపారు. ఈ సిట్ ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని.. ఏపీలో అధికారులకు పట్టిన గతే ఇక్కడ పడుతుందని హెచ్చరించారు. రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తామని అన్నారు. ఉద్యమంలో తనపై 300 కేసులు ఉన్నాయని.. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని స్పష్టం చేశారు.

సర్కార్ డిఫెన్స్‌లో పడింది..

కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడిందని హరీశ్‌రావు అన్నారు. 25 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఒక సీఎం రాత్రి 9.30 గంటలకు చిట్ చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదన్నారు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ పవర్ అని అన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లు పేదవాడికి అన్నం పెట్టవని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందని.. వాస్తు భయంతో సెక్రెటేరియట్ మెట్లు ఎక్కడం లేదని ఆరోపించారు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితం అయ్యారని అన్నారు. 4వేల మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలవడంతో ఆయనలో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే.. కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా, కాంగ్రెస్ కార్యకర్తలను నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఓయూకు ఒంటరిగా వస్తానని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి.. వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లారని.. విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని అన్నారు.

బీఆర్ఎస్‌కూ పీపీటీ చాన్స్ ఇవ్వాలి

సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పీపీటీని స్వాగతిస్తున్నామని.. కానీ వాస్తవాలు చెప్పడానికి బీఆర్ఎస్‌కు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం తమకు ఇస్తూ తమ గొంతు నొక్కుతున్నారని ఆఱోపించారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతామన్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం కాదని.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ అని.. బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తున్నదని ఆరోపించారు. అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ.180 కోట్ల కమీషన్ ఇచ్చారని.. ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి రూ.30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ.7వేల కోట్లను ఉత్తమ్, భట్టి పంచుకున్నారని.. 20 శాతం కమీషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారని అననారు. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల్లో నీటి వాడకం కేవలం 28.49 శాతం మాత్రమేనని.. తెలంగాణకు 45 టీఎంసీలు చాలని ఉత్తమ్‌రెడ్డి ఉత్తరం రాయడం చారిత్రక తప్పిదమన్నారు. దానికి క్షమాపణ చెప్పి, వెంటనే 90 టీఎంసీల కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాలలోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు అని హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్‌రెడ్డి.. చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాచుతూ చేస్తున్న డ్రామా చేస్తున్నారని.. ఆర్‌టీఐ సమాధానం ఆధారంగా తమ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్‌తో బట్టబయలు కాబోతున్నదని తెలిపారు. 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్‌లో ఉంచడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.

Next Story